క్యాట్‌, వనిత ఫ్యామిలీ కార్డులకు ఇక సెలవు..

     Written by : smtv Desk | Wed, Jul 04, 2018, 01:42 PM

క్యాట్‌, వనిత ఫ్యామిలీ కార్డులకు ఇక సెలవు..

అమరావతి, జూలై 4 : ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ నవ్య క్యాట్‌ కార్డ్‌, వనిత ఫ్యామిలీ కార్డులకు నిలిపేసే దిశగా చర్యలు . తీసుకొంది. తరచూ రాకపోకలు సాగించే ప్రయాణికులకు రాయితీ కల్పించేందుకు ఉద్దేశించిన నవ్య క్యాట్‌ కార్డ్‌, వనిత ఫ్యామిలీ కార్డులను బుధవారం నుంచి విక్రయాలను నిలిపివేయనుంది. ఈ నిర్ణయం దాదాపు ఏడు లక్షల మందిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఈ రెండు రకాల కార్డులు తీసుకుని ఉన్నవారికి మాత్రం వాటి గడువు ముగిసే వరకూ టిక్కెట్టుపై పది శాతం రాయితీ కొనసాగించనుంది.

చిల్లర సమస్యను అధిగమించడం పేరిట ఇటీవల తెలుగువెలుగు, ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ సహా అన్ని స్పెషల్‌ టైపు సర్వీసు బస్సుల్లో ఛార్జీలను ఆర్టీసీ సవరించింది. దీంతో టిక్కెట్‌ ధరలు రూ.10, రూ.15, రూ.20.. ఇలా మారిపోయాయి. ఫలితంగా పైన పేర్కొన్న కార్డుదారులకు టిక్కెట్టుపై పది శాతం మేర రాయితీ ఇచ్చే అంశంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని మార్గాల్లో వీరికి అసలు ఒక్క శాతం రాయితీ కూడా దక్కకపోతుండగా, మరికొన్ని మార్గాల్లో రాయితీ శాతం తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో దీనిపై వారం రోజులుగా అధ్యయనం చేసిన ఆర్టీసీ.. ఈ రెండు కార్డులను మార్కెటింగ్‌ చేయడం ఆర్థికంగా ప్రయోజనకరం కాదని భావించి అమ్మకాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకొంది.





Untitled Document
Advertisements