కెప్టెన్ గా వార్నర్..!

     Written by : smtv Desk | Thu, Jul 05, 2018, 11:00 AM

కెప్టెన్ గా వార్నర్..!

ఢిల్లీ, జూలై 5 : బాల్ టాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. అదేంటి వార్నర్ పై నిషేధం ఉందిగా..! మరి కెప్టెన్ గా ఎలా అనుకుంటున్నారా..! కానీ, మీరు చదివింది నిజమే. అయితే అది ఆసీస్‌ జట్టుకు కాదు. వార్నర్‌ ప్రస్తుతం కెనడాలో జరుగుతోన్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. డ్వేన్‌ బ్రావో నాయకత్వంలోని విన్నిపెగ్‌ హాక్స్‌ జట్టులో సభ్యుడు వార్నర్‌. కాగా గాయం కారణంగా బ్రావో మొత్తం టోర్నమెంట్‌కే దూరమయ్యాడు. దీంతో ఆ జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్ ఎంపిక వేటలో పడింది.

ఈ సందర్భంగా ఆ జట్టు కోచ్‌ వకార్‌ యూనిస్‌ మాట్లాడుతూ... 'కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ సరైన ఎంపిక. ఐపీఎల్‌లో అతని కెప్టెన్సీ చూశాను. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు నాయకత్వం వహిస్తూనే బ్యాటింగ్‌లోనూ రాణించాడు. ఆ అనుభవంతోనే అతడికి ఈ లీగ్‌లో కలిసి వచ్చే అవకాశం ఉంది' అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరోపక్క జట్టు యాజమాన్యం కూడా వార్నర్‌కే పగ్గాలు అప్పగించాలని భావిస్తోందని సమాచారం. బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన డేవిడ్‌ వార్నర్‌ను క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ఏడాది పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements