ఇండోనేషియాలో విషాదం

     Written by : smtv Desk | Thu, Jul 05, 2018, 03:13 PM

ఇండోనేషియాలో విషాదం

జకార్తా, జూలై 5 : ఇండోనేషియాలో విషాదం చోటుచేసుకుంది. 190 మందితో ప్రయాణిస్తున్న కె.ఎం.లెస్తారీ అనే 48 మీటర్ల పొడవైన నౌక మంగళవారం సులవేసీ నుంచి సెలయార్‌ తీరానికి పయనిస్తుండగా మార్గ మధ్యలో మునిగిపోయింది. ఈ ఘటనలో 34 మంది మృతి చెందారు. ప్రయాణికులందరికీ సరిపడినన్ని లైఫ్‌ జాకెట్లు నౌకలో అందుబాటులో లేకపోవడంతోనే మృతుల సంఖ్య పెరిగినట్లు అధికారులు తెలిపారు. నౌకలో ప్రయాణికులతో పాటు కొన్ని వాహనాలు కూడా ఉండటంతో అవన్నీ కలిసి నౌక సామర్థ్యానికి మించిపోయాయని అధికారులు వెల్లడించారు. సెలయార్‌ తీరానికి 300 మీటర్ల దూరం వచ్చే సరికి నౌక దాదాపు కనుమరుగై నీటిలో మునిగిపోయింది. నౌక సామర్థ్యానికి మించి ప్రయాణికులను, సరకులను మోసుకెళ్తుండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రవాణా శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

నౌక సేవలందించేందుకు తగిన అనుమతులు లేనట్లయితే యజమానిపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సెలయార్‌లో పనిచేస్తున్న కార్మికులకు బోనస్‌ ఇచ్చేందుకు బ్యాంకుకు తరలిస్తున్న రూ.20 లక్షల విలువైన ఇండోనేషియా కరెన్సీ కూడా ఇదే ఓడలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 7 సంచుల్లో నింపిన నగదును అధికారులు బయటకు తీయించారు. ఇండోనేషియాలో ఇటువంటి ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. ఈ దేశంలో వేల సంఖ్యలో దీవులున్నాయి. ఓ దీవి నుంచి మరో దీవికి వెళ్లాలంటే పడవలు, నౌకలే ఆధారం.







Untitled Document
Advertisements