'మాస్టర్ ఆఫ్ రోస్టర్' అతనే : సుప్రీంకోర్టు

     Written by : smtv Desk | Fri, Jul 06, 2018, 01:05 PM

'మాస్టర్ ఆఫ్ రోస్టర్' అతనే : సుప్రీంకోర్టు

ఢిల్లీ, జూలై 6 : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటులో విశేషాధికారాలుంటాయని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి నొక్కి చెప్పింది. ఆయనే 'మాస్టర్ ఆఫ్ ది రోస్టర్‌' అని, ధర్మాసనాలకు కేసులను కేటాయించే హక్కు ఉంటుందని అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతిభూషణ్‌ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి విశేషాధికారాలను ప్రశ్నిస్తూ శాంతి భూషణ్‌ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ నేడు విచారణకు వచ్చింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం.. సీజేఐ తన ప్రత్యేక అధికారాలను ఇతర న్యాయమూర్తులతో పంచుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

సీజేఐ సమానులలో ప్రథములు అని, ఆయనకు కేసులను కేటాయించే అధికారం ఉంటుందని వెల్లడించింది. సుప్రీంకోర్టు పాలనా వ్యవహారాలకు ఆయన నేతృత్వం వహిస్తారని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్‌ సిక్రీ తీర్పును వెల్లడిస్తూ.. న్యాయవ్యవస్థను తక్కువ చేసే ఇలాంటి చర్యలు న్యాయవ్యవస్థకు పెను ముప్పు అని పేర్కొన్నారు. సీజేఐ.. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి అని, న్యాయవ్యవస్థకు అధికార ప్రతినిధి లాంటివారని అన్నారు.

కేసుల కేటాయింపు, ధర్మాసనాల ఏర్పాటుపై అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నిస్తూ సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకుర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌లు ఈ ఏడాది జనవరిలో మీడియాలో సమావేశం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే న్యాయవాది అశోక్‌ పాండే, మాజీ మంత్రి శాంతి భూషణ్‌ పిటిషన్లు దాఖలు చేశారు.





Untitled Document
Advertisements