13న 'హస్తం' లోకి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ..!

     Written by : smtv Desk | Fri, Jul 06, 2018, 02:44 PM

13న 'హస్తం' లోకి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ..!

అమరావతి, జూలై 6 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 13న ఆయన కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఆయన సొంత గూటికి చేరుతారని వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరేముందు ఆయన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను కలవనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రేపో మాపో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారట. 13న కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరతారని..దిల్లీలో రాహుల్‌ సమక్షంలో పార్టీ కండువ కప్పుకుంటారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాహుల్‌గాంధీ నల్లారికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు ఏఐసీసీ వర్గాల అంటున్నాయి. అయితే కాంగ్రెస్‌లో చేరే విషయమై తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కిరణ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు సమర్థంగా నిర్వహించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే శ్రేణుల్లో ఉత్సాహం నింపవచ్చని అధిష్ఠానం యోచిస్తోంది. ముఖ్యంగా ప్రత్యేక హోదా అంశంలో కేంద్రంపై ఏపీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఏపీలో తిరిగి పుంజుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది.

దీనికి సంబంధించి ముఖ్య నేతలకు ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. 2019లో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాపైనే తొలి సంతకం చేస్తామని ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించడమూ కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించింది. ఈ క్రమంలోనే విభజన తర్వాత పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి రాష్ట్రంలో పునర్‌వైభవం సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తుంది.





Untitled Document
Advertisements