ఆరు విద్యాసంస్థలకు 'ఐఓఈ' హోదా..

     Written by : smtv Desk | Mon, Jul 09, 2018, 05:36 PM

ఆరు విద్యాసంస్థలకు 'ఐఓఈ' హోదా..

ఢిల్లీ, జూలై 9 : కేంద్ర మానవ వనరులశాఖ దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఆరు విద్యాసంస్థలకు ఇనిస్టిట్యూషన్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఐఓఈ)హోదా కల్పించింది. మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ హోదా కల్పించినట్లు కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రభుత్వ రంగానికి చెందిన ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐఎస్‌సీ బెంగళూరు, ప్రైవేటు సంస్థలైన మణిపాల్‌ అకాడమీ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌, బిట్స్‌ పిలానీ, జియో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌కు ఈ హోదాను కల్పించారు.

ఐఓఈ హోదా కోసం జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ సహా యూజీసీకి 100కు పైగా దరఖాస్తులు అందాయి. ఈ హోదా లభించడంతో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు పూర్తి స్వయం ప్రతిపత్తి లభించినట్టు అవుతుందని జవదేకర్ వ్యాఖ్యానించారు. ఈ సంస్థలకు ఉన్నత విద్యా సంస్థలుగా లభించే నిధులతో పాటు ఐదేళ్లలో రూ 1000 కోట్లు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు.





Untitled Document
Advertisements