హర్మన్‌ప్రీత్‌.. డీఎస్పీ టూ కానిస్టేబుల్‌

     Written by : smtv Desk | Tue, Jul 10, 2018, 04:01 PM

 హర్మన్‌ప్రీత్‌.. డీఎస్పీ టూ కానిస్టేబుల్‌

అమృత్‌సర్‌, జూలై 10 : భారత మహిళల క్రికెట్‌ జట్టు స్టార్‌ హర్మన్‌ప్రీత్‌ నకిలీ డిగ్రీతో పంజాబ్‌ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్నిసాధించనట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోను ఆమెను డీఎస్పీ పదవి నుంచి తొలగించి కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇవ్వనున్నట్లు పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఒంటిచేత్తో టీమిండియాను ఫైనల్‌కి చేర్చింది. దీంతో పంజాబ్ ప్రభుత్వం ఆమె అద్భుత ప్రదర్శనకు మెచ్చి డీఎస్పీ ఉద్యోగాన్ని ఆఫర్ చేయగా.. ఈ ఏడాది మార్చి 1న హర్మన్‌ప్రీత్ కౌర్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టింది.

అయితే ఈ ఉద్యోగం కోసం ఆమె మేరట్‌లోని చరణ్‌ సింగ్‌ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు సర్టిఫికెట్లు సమర్పించింది. హర్మన్‌ అందించిన సరిఫికెట్ల పరిశీలన చేపట్టగా ఆ విశ్వవిద్యాలయంలో ఆమె డిగ్రీ పూర్తి చేసినట్లు ఎక్కడా వివరాలు లేవు. దీంతో హర్మన్‌ సమర్పించిన డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవిగా పంజాబ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇదే విషయాన్ని పోలీసు శాఖ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. దీంతో 12వ తరగతి మాత్రమే పాసైనట్లు ప్రభుత్వం భావించి ఆమె ఒప్పుకుంటే కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

Untitled Document
Advertisements