అగ్రరాజ్య అధ్యక్షుడుపై కేసు వేసిన కారు డ్రైవర్‌..

     Written by : smtv Desk | Tue, Jul 10, 2018, 06:27 PM

అగ్రరాజ్య అధ్యక్షుడుపై కేసు వేసిన కారు డ్రైవర్‌..

వాషింగ్టన్‌, జూలై 10 : అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆయన కారు డ్రైవర్‌ అయిన నోయిల్‌ సిన్ట్రన్‌(59) కేసు వేశాడు. గత 20 సంవత్సరాల నుంచి అధిక సమయం పని చేసినందుకు తగిన వేతనం చెల్లించలేదని స్ట్రినన్‌ ఆరోపించాడు. తాను ట్రంప్‌ దగ్గర పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి వార్షిక వేతనాన్ని రెండేసార్లు పెంచినట్లు పేర్కొన్నాడు. 2003లో తొలిసారి 62,700 డాలర్లకు, 2010లో మరోసారి 75,000 డాలర్లకు మాత్రమే పెంచినట్లు సిన్ట్రన్‌ తన పిటిషన్‌లో వివరించాడు. ఉదయం 7 గంటల నుంచి ఎంత రాత్రైనా ట్రంప్‌ కుటుంబ సభ్యుల పనులు ముగిశాకే ఇంటికి వెళ్లేవాడినని తెలిపాడు. అలా వారానికి దాదాపు 50 పని గంటలు అదనంగా చేసినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.

న్యూయార్క్ నిబంధనల ప్రకారం ఒక గంట అదనంగా పనిచేస్తే గంటన్నర వేతనాన్ని చెల్లించాలి. ట్రంప్‌ మాత్రం తనకు నిర్ణయించిన వేతనాన్నే చెల్లించేవారు తప్ప అదనపు పని గంటలకు ఏమీ చెల్లించలేదని స్ట్రినన్‌ ఆరోపించాడు. మొత్తం అదనపు పని గంటలకుగాను 2,00,000 డాలర్లు చెల్లించాలని డిమాండ్‌ చేశాడు. ఈ మొత్తానికి వడ్డీ, లేటుగా చెల్లిస్తున్నందుకు జరిమానా, న్యాయవాది ఫీజుతో కలిపి 3,50,000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం దాదాపు రెండు కోట్ల 40 లక్షల 68వేల రూపాయలు) చెల్లించాలంటూ సిన్ట్రన్ తన‌ పిటిషన్‌లో పేర్కొన్నాడు. స్ట్రినన్‌ ఆరోపణలపై ట్రంప్‌ కార్యాలయ ప్రతినిధి అమేండా మిల్లర్‌ బదులిస్తూ..."సిన్ట్రన్‌కు నిబంధనల ప్రకారమే వేతనాన్ని చెల్లించాము. నిజానిజాలు బయటపెట్టి కోర్టు నుంచి త్వరలోనే క్లీన్‌ చిట్‌ అదుకుంటాము" అని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements