చెత్తలో దేశ రాజధాని.. వరద నీటిలో ఆర్ధిక రాజధాని..

     Written by : smtv Desk | Wed, Jul 11, 2018, 02:19 PM

చెత్తలో దేశ రాజధాని.. వరద నీటిలో ఆర్ధిక రాజధాని..

ఢిల్లీ, జూలై 11 : ఓ వైపు వర్షాలతో దేశ ఆర్ధిక రాజధాని ముంబై అతలాకుతలం అవుతుంది. మరో వైపు దేశ రాజధాని ఢిల్లీ 'చెత్త' కుప్పలతో సతమతమవుతుంది. ఇక్కడి ప్రజల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలకుల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. చెత్త కుప్పల మధ్య ఢిల్లీ నగరం సమాధి అవుతున్నా - వరద నీటితో ముంబై మునిగిపోతున్నా ప్రభుత్వాలు ఏమీ చేయడం లేదని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆవేదన వ్యక్తం చేసింది. ఘన వ్యర్థాల యాజమాన్య విధానాల అమలుపై అఫిడవిట్లు దాఖలు చేయని 10 రాష్ట్ర ప్రభుత్వాలు - రెండు కేంద్ర పాలిత ప్రాంతాలపై రూ. లక్ష చొప్పున జరిమాన విధించింది.

వ్యర్థాల నిర్వహణ విషయంలో ఆయా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోకపోతుండటంతో దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు స్వీకరించింది. పరిపాలనా వ్యవహారాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటే న్యాయ వ్యవస్థ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నదంటూ న్యాయమూర్తులపై దాడి చేస్తారని జస్టిస్ లు ఎంబీ లోకూర్ - దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మరోవైపు కుండపోత వానలు ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముంబై చుట్టు పక్కల ప్రాంతాలపై సైతం తీవ్ర ప్రభావాన్ని చూపాయి. వరుసగా నాలుగోరోజు మంగళవారం కూడా భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలపై వర్షపు నీరు నిలువడంతో పశ్చిమ రైల్వేలోని సబర్బన్ రైళ్ల సర్వీసులు రద్దయ్యాయని - ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ తోపాటు సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయని అధికారులు తెలిపారు.





Untitled Document
Advertisements