కులదీప్ మెరిశాడు.. హిట్ మ్యాన్ దంచేశాడు..

     Written by : smtv Desk | Fri, Jul 13, 2018, 11:15 AM

కులదీప్ మెరిశాడు.. హిట్ మ్యాన్ దంచేశాడు..

నాటింగ్‌హమ్‌, జూలై 13 : ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా జట్టు ఆదరగోడుతుంది. ఇటీవల వారి సొంతగడ్డపై టీ-20 సిరీస్ దక్కించుకొన్న కోహ్లి సేన... మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డే లో ఘన విజయం సాధించింది. ఒకవైపు చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (6/25) మాయాజాలం.. మరోవైపు హిట్‌మ్యాన్‌ రోహిత్‌శర్మ (137 నాటౌట్‌; 114 బంతుల్లో 15×4, 4×6) మెరుపు సెంచరీ తో ప్రత్యర్ధి పై విరుచుకుపడ్డారు. దీంతో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఇంగ్లిష్‌ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి మూడు వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ పడుతూ లేస్తూ ఇన్నింగ్స్‌ కొనసాగించింది. మొదటిలో ఆ జట్టు భారీ స్కోర్ చేసేలా కనిపించింది. రాయ్‌, బెయిర్‌స్టో మెరుపులతో 10 ఓవర్లకు ఆ జట్టు 71 పరుగులు చేసింది. అక్కడితో ఆ హవా ఆగిపోయింది. అందుకు కారణం కుల్‌దీప్‌. అద్భుతంగా బౌలింగ్‌ చేసిన ఈ చైనామన్‌ చిన్నోడు ఇంగ్లాండ్‌ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ తీశాడు. ఆఖర్లో మొయిన్‌ అలీ (24), రషీద్‌ (22) వేగంగా ఆడడంతో ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది.

లక్ష్యచేధనలో భారత్ ఆరంభం నుంచే రోహిత్‌, శిఖర్‌ ధావన్‌ (40; 27 బంతుల్లో 8×4) స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించారు. తొలి వికెట్‌కు వేగంగా 59 పరుగులు జోడించిన తర్వాత ధావన్‌ ఔటయ్యాడు. తర్వాత హిట్ మ్యాన్ చెలరేగిపోయాడు. 54 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన అతను.. అదే ఊపులో సెంచరీకి చేరువయ్యాడు. రషీద్‌ బౌలింగ్‌లో కళ్లుచెదిరే సిక్సర్‌తో అతను 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

వన్డేల్లో అతనికిది 18వ సెంచరీ. మరో వైపు కెప్టెన్ కోహ్లి (75) పరుగులతో అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. చివరిలో విరాట్‌ ఔటైనా.. రోహిత్‌, రాహుల్‌తో (9 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. భారత్‌ 40.1 ఓవర్లలో 2 వికెట్లకు 269 పరుగులు చేసి విజయం సాధించింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు కులదీప్ యాదవ్ కు దక్కింది.





Untitled Document
Advertisements