ధియేటర్ల తిక్క కుదిరింది..!

     Written by : smtv Desk | Fri, Jul 13, 2018, 04:07 PM

ధియేటర్ల తిక్క కుదిరింది..!

ముంబై, జూలై 13 : జాలీగా గడుపుదామని సినిమా చూడటానికి వెళ్తే ధియేటర్ యాజమాన్యాలు పలు రకాల ఫీజులతో పాటు.. బయట నుండి తెచ్చే తిను బండరాలపై నిషేధం విధిస్తున్నాయి. పోనీ లోపల ధరలు ఎం.ఆర్.పీ కు అనుగుణంగా ఉంటాయా అంటే ఏది లేదు. దీంతో ఇష్టారాజ్యంగా సాగుతున్న వసూళ్లను అడ్డుకునేవారే లేరా అనేది సగటు పౌరుడి మదిలో మెదిలే ప్రశ్న. ఈ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగేసింది. సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా చూడటానికి వెళ్లేవాళ్లు తమ వెంట ఆహార పదార్థాలను తీసుకొని వెళ్లొచ్చని స్పష్టం చేసింది. తద్వారా థియేటర్లలో విక్రయించే ఫుడ్ ఐటెమ్స్ రేట్లలో గణనీయ తగ్గుదల కనిపించే అవకాశాలున్నాయి.

ఆగస్టు 1 నుంచి అన్ని రకాల సినిమా హాళ్లు ఈ నిబంధనను పాటించాలని సూచించింది. ఒకవేళ సినిమా థియేటర్లు ఈ నిబంధనను పాటించకుంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా మహారాష్ట్ర ప్రభుత్వం ఓ విధానాన్ని రూపొందించాలనే ఆలోచనలో ఉంది. ఈ వివరాలను ఆ రాష్ట్ర ఆహార శాఖ మంత్రి రవీంద్ర చావన్ మీడియాకు తెలిపారు. ఫుడ్ ఐటమ్స్‌తో సినిమాకు వెళ్తున్నవారిని ఇకపై ఎవరైనా అడ్డుకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయమే తీసుకోవాలని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.





Untitled Document
Advertisements