క్రికెట్ కు వీడ్కోలు పలికిన కైఫ్..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 11:02 AM

క్రికెట్ కు వీడ్కోలు పలికిన కైఫ్..

ఢిల్లీ, జూలై 14 : టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్‌ కైఫ్‌ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం వెల్లడించారు. సరిగ్గా 16 సంవత్సరాల క్రితం (2002 జూలై 13) నాట్‌వెస్ట్‌ ట్రోఫీ ఫైనల్లో అద్భుత పోరాటంతో వెలుగులోకి వచ్చిన కైఫ్‌ తన రిటైర్మెంట్‌కు అదే రోజును ఎంచుకోవడం విశేషం. 37 ఏళ్ల కైఫ్‌ 13 టెస్టులు, 125 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన అతను 129 దేశవాళీ మ్యాచ్‌ల్లో 7,581 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు ఉన్నాయి. అండర్‌–19 ప్రపంచకప్‌ (2000) గెలిచిన భారత యువ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన కైఫ్‌ ఆ తర్వాత టీమిండియాలోకివచ్చాడు.

'ఈ రోజు నాకు ఎంతో ప్రత్యేకమైనది అందుకే రిటైర్మెంట్‌కు దీన్ని ఎంచుకున్నా' అని కైఫ్‌ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నాడు. పాయింట్, కవర్స్‌లో కళ్లు చెదిరే క్యాచ్‌లతో ఫీల్డింగ్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన కైఫ్‌... ఆసాధ్యం అనదగ్గ ఎన్నో క్యాచ్‌లను ఒడిసిపట్టి 'ఇండియన్‌ జాంటీ రోడ్స్‌'గా అభిమానుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నాడు. 12 ఏళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన అతను ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Untitled Document
Advertisements