సిరీస్ టీమిండియాదే : దాదా

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 01:24 PM

సిరీస్ టీమిండియాదే : దాదా

లండన్, జూలై 14 ‌‌: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా జట్టు ఈ రోజు ఆ జట్టుతో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ను దక్కించుకొన్న కోహ్లి సేన.. రెండో వన్డేను గెలిచి సిరీస్‌ను చేజిక్కుంచుకోవాలని భావిస్తుంది. మరో వైపు సొంతగడ్డపై భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఇంగ్లాండ్ యోచిస్తోంది. కాగా భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య వన్డే సిరీస్‌కు గంగూలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడుతూ... '2002 జులై 13న లార్డ్స్‌ మైదానంలో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై మేము ఎలాగైతే నాట్‌వెస్ట్‌ సిరీస్‌ సొంతం చేసుకున్నామో... సరిగ్గా అలాగే కోహ్లీ సేన ఈ రోజు అదే మైదానంలో ఇంగ్లాండ్‌పై రెండో వన్డే గెలిచి ఈ సిరీస్‌ కైవసం చేసుకుంటుంది. ప్రస్తుత పర్యటనలో కోహ్లీ సేన ఇంగ్లిష్‌ జట్టుతో మూడు టీ20లు, ఒక వన్డే అంటే మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల్లో భారత్‌దే పూర్తి ఆధిపత్యం. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఒక బ్యాట్స్‌మెన్‌ శతకం సాధించాడు. మిగతా వాటి కంటే కార్డిఫ్‌ పిచ్‌ కాస్త భిన్నం. ఇప్పటికైనా ఇంగ్లాండ్‌ మేల్కోవాలి. కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోతే మరో మ్యాచ్‌లో భారత్‌దే పూర్తి ఆధిపత్యం అవుతుంది' అని గంగూలీ పేర్కొన్నాడు.





Untitled Document
Advertisements