వెబ్ సిరీస్ లపై సెన్సార్ కన్ను..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 05:35 PM

వెబ్ సిరీస్ లపై సెన్సార్ కన్ను..

హైదరాబాద్, జూలై 14 : సాధారణంగా సినిమాలకు సెన్సార్ ఉంటుంది. కానీ పలు వెబ్ సిరీస్ లకు మాత్రం సెన్సార్ లేదు. దీంతో ఇంటర్నెట్ లో వస్తున్న వెబ్ సిరీస్ లకు నియంత్రణ లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో అశ్లీలం మరీ పెరిగిపోయింది. వాటికి నియంత్రణ లేకపోవడంతో విపరీతంగా వ్యాపిస్తోంది. నెట్ లో కొత్తగా మొదలైన వెబ్ సిరీస్ లు రచ్చ రచ్చ చేస్తున్నాయి. తాజాగా ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' తొలిసారిగా పూర్తి భారతీయ చిత్ర కథాంశంతో తెరకెక్కించిన 'సాక్రెడ్ గేమ్స్' విడుదలై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది.

1980.. 90 నాటి ముంబై గ్యాంగ్ స్టర్స్.. పోలీసుల మధ్య జరిగిన దాడులు.. ప్రతిదాడుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను తీస్తున్నారు. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో బాలీవుడ్ ప్రముఖ నటులు సైఫ్ అలీఖాన్.. నవాజుద్దీన్ సిద్దికీ.. రాధికా అప్టే.. కుబ్రా సైత్ లు నటించారు. ఈ వెబ్ సిరీస్ లో ఒకచోట దివంగత ప్రధాని రాజీవ్ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన పాలన కాలంలో జరిగిన అంశాలను వక్రీకరించారని కోల్ కతా కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.

ఇదే విషయంపై కాంగ్రెస్ కూడా ఈ వెబ్ సిరీస్ పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా దీనిపై దుమారం రేగడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇక నుండి సెన్సార్ కట్స్ ను వెబ్ సిరీస్ లకు వర్తింపచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కఠినమైన నిబంధనలు రూపొందించబోతున్నట్లు కేంద్ర సాంకేతిక, ప్రసారశాఖ ప్రకటించింది. దీంతో కాస్తైనా అశ్లీలానికి అడ్డుకట్ట వేయవచ్చని భావిస్తున్నారు.





Untitled Document
Advertisements