'విజేత' నాకు వ్యక్తిగతంగా నచ్చింది..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 11:54 AM

'విజేత' నాకు వ్యక్తిగతంగా నచ్చింది..

హైదరాబాద్, జూలై 16 : మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ 'విజేత' సినిమా ద్వారా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూలై 12న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ వీక్షించి.. చిత్ర యూనిట్ ను అభినంది౦చిన విషయం తెలిసిందే. చిత్ర విజయాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరయ్యారు. రాకేశ్ శశి దర్శకత్వం వహి౦చిన ఈ చిత్రాన్ని వారాహి సంస్థ‌ బ్యానర్ లో సాయి కొర్ర‌పాటి, ర‌జినీ కొర్ర‌పాటి నిర్మించారు. మాళవిక నాయర్ కథానాయికగా నటించి౦ది.

ఈ సందర్భంగా అల్లు అర్జున్.. "కల్యాణ్‌దేవ్‌ అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం. ఈ సినిమాలో చాలాసేపు కల్యాణ్‌ నటననే గమనించా. ఆ తర్వాత తనని మరిచిపోయి ఆ పాత్రనే చూశా. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాల్లోనూ బాగా నటించి కంటతడి పెట్టించాడు. రాకేష్‌ శశి రెండో సినిమా అయినా బాగా తీశాడు. నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. వ్యక్తిగతంగా ఈ సినిమా నచ్చడంతోనే ఈ వేడుకకి వచ్చి మాట్లాడుతున్నా. ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు చూడాలి. నేను చూసిన అత్యుత్తమ పతాక సన్నివేశాలంటే ఈ చిత్రంలోనివే. సినిమా అయిపోయాక కూడా చాలాసేపు థియేటర్ లో అలా కూర్చుండిపోయామన్నారు. మా పిల్లలకి ఈ చిత్రంలోని గీతాలంటే చాలా ఇష్టం. కొక్కొరోకో సాంగ్ పెట్టు అంటూ రోజు అడుగుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

దర్శకుడు రాకేశ్ శశి మాట్లాడుతూ.. 'కథ చెప్పగానే మంచి కథతో కల్యాణ్‌ పరిచయం అవుతున్నాడని మమ్మల్నెంతగానో ప్రోత్సహించారు చిరంజీవి. మేం అనుకొన్న పాత్రకి మరో పది రెట్లు బలాన్ని చేకూరుస్తూ సినిమా చేశారు మురళీశర్మ. కల్యాణ్‌ కూడా ప్రతిదీ నేర్చుకొని సహజంగా ఈ చిత్రంలో నటించాడు" అని పేర్కొన్నారు. అలాగే హీరో కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. తండ్రీ కొడుకులు చాలా మంది ఈ సినిమా చూసి హృదయాల్ని హత్తుకొనే చిత్రం అని, మంచి సందేశం ఇచ్చారని మెచ్చుకొన్నారు. వారి కాంప్లిమెంట్స్ నాకు చాలా సంతృప్తినిచ్చాయి. దర్శకుడు రాకేష్‌ మంచి కథతో ఈ చిత్రాన్ని తీశాడు. ఈ సినిమా చూసి బన్ని బాగుందని మెచ్చుకొని, మమ్మల్ని మరింత ప్రోత్సహించడానికి ఈ వేడుకకి వచ్చారు' అంటూ వెల్లడించారు.





Untitled Document
Advertisements