కానరాని చిన్నారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 11:55 AM

కానరాని చిన్నారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..

రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో పడవ ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్న గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ ఇంకా దొరకడం లేదు. గల్లంతైన ఆ ఆరుగురు బాలికల కోసం అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇందుకోసం మూడంచెల గాలింపు చర్యలు చేపట్టారు. సెర్చ్‌ ఆపరేషన్‌లో 15 టీంలు పాల్గొంటున్నాయి. ఈ సహాయక చర్యల్లో ఫైర్‌, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో పాటు నేవి హెలికాఫ్టర్‌తో అధికారుల సెర్చ్‌ ఆపరేషన్‌ నడుస్తోంది. కాగా గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున మృతదేహాలు పైకి తేలకుండా సముద్రంలోకి వెళ్లిపోయి ఉంటాయని స్థానిక మత్స్యకారులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే వారి ఆచూకీ తెలియడం కష్టమేనని అంటున్నారు.

ఇలాంటి ఇబ్బంది ఉంటుందని ముందుగానే గ్రహించిన అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతంలో కాకుండా పది కిలోమీటర్ల దిగువన బేస్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టారు. ఈరోజు వర్షం తగ్గుముఖం పట్టడంతో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆదివారం రాత్రి కూడా ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, మత్స్యకారులు నదిలో గాలింపు చేపట్టారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా యానాం వద్ద పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన విద్యార్థినుల ఆచూకీ కోసం చేస్తున్న సెర్చ్‌ ఆపరేషన్‌కు పాండిచ్చేరి ప్రభుత్వం సహకరిస్తోందని జిలా​ కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా తెలిపారు.





Untitled Document
Advertisements