సాహా ఆడటం అనుమానమే..!

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 12:56 PM

సాహా ఆడటం అనుమానమే..!

లండన్, జూలై 16 ‌: ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌ కు టీమిండియా కీపర్ వృద్ధిమాన్‌ సాహా ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ గడ్డపై టీ20 సిరీస్ ముగియగా.. మంగళవారం జరగనున్న మూడో వన్డేతో వన్డే సిరీస్‌ కూడా ముగియనుంది. ఆ తర్వాత ఆగస్టు తొలి వారం నుంచి ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులను భారత్ జట్టు ఆడనుంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సాహా ఆ లీగ్‌లోనే గాయపడ్డాడు. దీంతో అతడు జూన్‌లో అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు దూరం కావాల్సి వచ్చింది. తాజాగా సాహా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని సమాచారం. అందుకే ఇంగ్లాండ్‌ చేరుకున్న సాహా సోమవారం నుంచి ఇంగ్లాండ్‌ లయన్స్‌తో ప్రారంభమయ్యే అనధికారి టెస్టులో ఆడటం లేదని తెలుస్తోంది.

దీంతో మరికొద్ది రోజుల్లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో తొలి టెస్టుకు సాహా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. సాహా స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ నెల 25న టీమిండియా ఎసెక్స్‌ జట్టుతో సన్నాహక టెస్టు ఆడనుంది. ఇంగ్లాండ్‌తో వన్డే జట్టుకి ఎంపికైన దినేశ్ కార్తీక్‌కి.. మిడిలార్డర్‌లో చోటు దక్కడం లేదు. కేఎల్ రాహుల్, సురేశ్ రైనా మెరుగ్గా రాణిస్తుండటంతో అతడ్ని పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. టెస్టుల్లో ఒకవేళ అవకాశం దక్కితే కార్తీక్‌ ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి..!

Untitled Document
Advertisements