రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోయాయి : కన్నా

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 02:31 PM

రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోయాయి : కన్నా

ఢిల్లీ, జూలై 16 : ఏపీలో అత్యాచారాలు, హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం అవేమీ పట్టించుకోవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఇవేవి పట్టకుండా అధికార పార్టీ దోపిడీపైనే శ్రద్ధ పెట్టిందని ఆయన ధ్వజమెత్తారు. జన్మభూమి కమిటీల నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని స్థాయిల్లోనూ అవినీతి విపరీతంగా జరుగుతోందని ఆరోపించారు. దిల్లీ పర్యటనలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ.. ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమై రాష్ట్రంలోని శాంతి భద్రతల అంశంపై ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోయాయి. బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. ఎక్కడైనా పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగితే పోలీసులు అధికార పార్టీ నేతలను వదిలేసి ఇతర పార్టీల వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. బీజేపీ నేతలపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. నేను అనంతపురం పర్యటనకు వెళ్లినప్పుడు గెస్ట్ హౌస్‌పై దాడికి పాల్పడ్డారు. కావలిలో చెప్పుల దాడి జరిగింది. ఒంగోలులోనూ దాడికి యత్నించగా.. భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. భాజపా జతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తిరుమల వచ్చినప్పుడు పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని నిలదీస్తున్నందుకే దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం తీరును ఎవరు ప్రశ్నించినా వేధిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి అరాచక పాలన ముందెన్నడూ చూడలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశాను' అని ఆయన వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements