'పవర్ స్టార్' దర్శకుడితో 'మెగా అల్లుడు'..!

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 02:59 PM

'పవర్ స్టార్' దర్శకుడితో 'మెగా అల్లుడు'..!

హైదరాబాద్, జూలై 16 : 'విజేత' సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు అరంగేట్రం చేసిన మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తన తదుపరి మూవీపై ఫోకస్ పెట్టారు. తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కొడుకుగా ‘విజేత’ కావాలని ఆకాంక్షించాడు. అయితే ఈ తండ్రి కొడుకుల 'విజేత' కథలో కొడుకు కంటే ఎక్కువ మార్కులు తండ్రిగా చేసిన మురళీ శర్మకే పడ్డాయి. కళ్యాణ్ దేవ్ ఇంకా చాలా విషయాల్లో మెరుగుపడాల్సి ఉందనేది మెజార్టీ ప్రేక్షకుల భావన. ఇక 'విజేత' సినిమా సంగతి అటుంచితే.. తన రెండో సినిమాలో హీరోయిజంతో పాటు మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ఎలిమెంట్స్‌తో యాక్షన్ కమర్షియల్ మూవీకి మెగా కాంపౌండ్ ఆలోచనలో ఉందట.

అందుకోసం యంగ్ కమర్షియల్ డైరెక్టర్, 'గబ్బర్ సింగ్' మూవీ దర్శకుడు హరీష్ శంకర్‌తో టచ్‌లో ఉన్నారట కళ్యాణ్ దేవ్. 'డీజే', 'గబ్బర్ సింగ్', 'మిరపకాయ్', 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన హరీష్ శంకర్ కళ్యాణ్ దేవ్ కోసం మాస్ మసాలా ఎంటర్ టైనర్‌ కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడు చేసిన ఆరు సినిమాల్లో నాలుగు హిట్స్ ఉంటే.. అందులో రవితేజ ‘మిరపకాయ్’ తప్ప మిగిలిన మూడు చిత్రాలు మెగా హీరోలు నటించినవే కావడంతో కళ్యాణ్ దేవ్‌కి హిట్ ఇచ్చే బాధ్యతను ఈ కమర్షియల్ దర్శకుడు భుజాలపై వేసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మెగా అల్లుడుతో మూవీ చేసేందుకు హరీష్ శంకర్‌తో పాటు మరో యంగ్ దర్శకుడు కథతో రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరికీ మెగాస్టార్ ఛాన్స్ ఇస్తారో చూడాలి..!





Untitled Document
Advertisements