ఆ విషయంలో మోదీకు.. మద్దతు ఇస్తామంటున్న రాహుల్..

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 04:44 PM

ఆ విషయంలో మోదీకు.. మద్దతు ఇస్తామంటున్న రాహుల్..

ఢిల్లీ, జూలై 16 : వచ్చే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని.. మహిళల రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కాంగ్రెస్‌ పార్టీ బేషరతుగా మద్దతిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇదే విషయమై ప్రధాని మోదీకి లేఖ కూడా రాసినట్లు రాహుల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ' మోదీ రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన సమయం వచ్చింది. మహిళల సాధికారత కోసం పోరాడుతానని ఆయన (మోదీ) చెబుతుంటారు కదా. పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళల రిజర్వేషన్‌ బిల్లుకు ఆమోద ముద్ర పడాలి. ఈ విషయంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుంది’ అని రాహుల్‌ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని లేఖ ద్వారా ప్రధానికి తెలియజేసినట్లు రాహుల్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

'మహిళా రిజర్వేషన్‌ బిల్లు 2010 మార్చిలో రాజ్యసభలో ఆమోదం పొందింది. అయితే గత ఎనిమిదేళ్లుగా లోక్‌సభలో మాత్రం ఆమోద ముద్ర పడట్లేదు. 2010లో రాజ్యసభలో అప్పటి ప్రతిపక్ష నేత అరుణ్‌ జైట్లీ ఈ బిల్లును చరిత్రాత్మకం అని ప్రశంసించారు. అయితే ఇప్పుడు భాజపా దీనిపై మరో ఆలోచనలో ఉన్నట్లు అనిపిస్తోంది. బహిరంగ సభల్లో చాలా సార్లు మీరు మహిళా సాధికారత గురించి మాట్లాడారు. మరి ఈ సారి అయినా బిల్లుకు ఆమోద ముద్ర పడుతుందా..? ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మీకు పూర్తి మద్దతిస్తుంది’ అని రాహుల్‌ లేఖలో తెలిపారు.





Untitled Document
Advertisements