ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 11:32 AM

ప్రారంభమైన పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు

ఢిల్లీ, జూలై 18 : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ఆరంభమయ్యాయి. మొత్తం 18 పని దినాలపాటు పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ రోజు నుండి మొదలైన సమావేశాలు ఆగస్టు 10వ తేదీ వరకు జరగనున్నాయి. ప్రశ్నోత్తరాలు, శూన్యగంట కాకుండా వివిధ అంశాలపై చర్చకు 62 గంటల సమయాన్ని కేటాయించారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని.. అన్ని పార్టీలు సభా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.24 రోజుల్లో 18 పని దినాల పాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో 46 బిల్లుల్ని చర్చించి ఆమోదించుకోవాలని అధికార పక్షం సమాయత్తమవుతోంది.

కేంద్రమంత్రి అనంతకుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ సభకు సహకరించాలని అన్ని పక్షాలకూ విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. ‘తెలుగుదేశం ప్రవేశపెట్టే అవిశ్వాసంతో సహా అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్యను లేవనెత్తినా సమాధానం చెప్పడానికి సిద్ధమే’నని వివరించారు. సభ జరిగితే ప్రతి అంశం చర్చకు వస్తుందని, దానికి సమాధానం కూడా దొరుకుతుందన్నారు.





Untitled Document
Advertisements