కూరగాయల రంగంలోకి 'పతంజలి'..

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 06:05 PM

 కూరగాయల రంగంలోకి 'పతంజలి'..

ఢిల్లీ, జూలై 18 : విదేశీ ఉత్పత్తులకు ధీటుగా మార్కెట్ లోకి ప్రవేశించిన 'పతంజలి' కంపెనీ మంచి పేరుతో పాటు, లాభాలను కూడా అదే విధంగా సాధించింది. ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్‌, ఆచార్య బాలకృష్ణ కలిసి 2006లో ఈ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ను స్థాపించారు. నూడుల్స్‌, సబ్బులు, షాంపూలు, బిస్కెట్లు వంటి గృహావసర ఉత్పత్తులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పతంజలి.. తాజాగా ఇప్పుడు మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. శీతలీకరించిన కూరగాయలు, ఖాదీ ఉత్పత్తులను తీసుకురానుంది. ఇందుకోసం రూ.10వేల కోట్లు వెచ్చించనుందని కొన్ని ఓ టీవీ ఛానల్‌ పేర్కొంది. మరోవైపు కూరగాయలతో పాటు.. ఖాదీ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించాలని పతంజలి భావిస్తోందట. ‘స్వదేశ్‌’ పేరిట ఈ ఏడాది దివాలీ నాటికి 100 రిటైల్‌ స్టోర్లను తెరవాలని భావిస్తోందని సమాచారం.

ఇప్పటికే శీతలీకరించిన బఠాణీలను పలు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా విక్రయిస్తున్న పతంజలి.. త్వరలో క్యారెట్‌, కాలీఫ్లవర్‌ను విక్రయించనున్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని కంపెనీ యూనిట్ల నుంచి ఆయా కూరగాయలను సేకరించాలని కంపెనీ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. ఇందుకోసం 2019 నాటికి 10వేల రిటైల్‌ అవుట్‌లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందట. ప్రస్తుతం శీతలీకరించిన పండ్లు, కూరగాయల వ్యాపారం దేశవ్యాప్తంగా రూ.1500 కోట్ల వరకు జరుగుతోందని, భవిష్యత్‌లో మరింత విస్తరించే అవకాశముందని మార్కెట్‌ విశ్లేషకుల అంచనా.

Untitled Document
Advertisements