ధోని రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 11:27 AM

ధోని రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన రవిశాస్త్రి..

లీడ్స్, జూలై 19 ‌: మహేంద్ర సింగ్ ధోని వన్డేలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నాడా..! ఇప్పుడు యావత్ భారత్ క్రీడాభిమానులను వేధిస్తున్న ప్రశ్న. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా.. ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మకమైన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓటమి చెందడంతో టీమిండియా వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌ ముగియగానే ఆటగాళ్లందరు మైదానాన్ని వీడుతున్న సమయంలో టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోని.. అంపైర్లను అడిగి మరి బంతి తీసుకున్నాడు. దీంతో ఈ ధోని క్రికెట్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికినట్లు తీవ్రస్థాయిలో ఊహాగానాలకు తెరలేచాయి. ప్రస్తుతం ఈ సీనియర్‌ ఆటగాడి ఫామ్‌ కలవరపెట్టడం.. 2014లో టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించే సందర్భంలోనూ అంపైర్ల నుంచి వికెట్‌ తీసుకోవడంతో ధోని రిటైర్మెంట్‌కు మరింత బలం చేకూర్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రోల్‌ అవుతున్న టాపిక్‌ ఈ విన్నింగ్‌ కెప్టెన్‌ రిటైర్మెంట్‌ గురించే కావడం విశేషం.

స్పష్టత ఇచ్చిన రవిశాస్త్రి..

ధోని రిటైర్మెంట్‌పై భారత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ఫుల్ స్టాప్ పెట్టాడు. బుధవారం ఓ ప్రముఖ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ధోని రిటైర్మెంట్‌ వదంతులపై క్లారిటీ ఇచ్చాడు. "ధోని ఎటూ వెళ్లటం లేదు.. టీమిండియాతో అతడు ఇంకొంత కాలం ప్రయాణిస్తాడు. బంతిని బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌కు చూపించడానికే తీసుకున్నాడు. మ్యాచ్‌లో బంతితో పడిన ఇబ్బందుల గురించి చెప్పడానికి ఒక జనరల్‌ ఐడియా కోసం తీసకున్నాడే తప్పా ఏ రిటైర్మెం‍ట్‌ ఉద్దేశం లేదు" అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.





Untitled Document
Advertisements