అ'విశ్వాసం'పై సోనియా లెక్క ఏంటి..!

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 02:24 PM

అ'విశ్వాసం'పై సోనియా లెక్క ఏంటి..!

ఢిల్లీ, జూలై 19 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఇప్పుడు నడుస్తున్న ప్రస్తుత హాట్ టాపిక్ 'అవిశ్వాస తీర్మానం'. కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు బలనిరూపణకు చకచకా పావులు కదుపుతున్నాయి. అటు అధికార పార్టీ కూడా అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని అంటుంది. అవిశ్వాసం గెలవడానికి అవసరమైన సంఖ్యా బలం తమకు ఉందని, బీజేపీయేతర శక్తులను కలపుకొని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని యూపీఏ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే సోనియాగాంధీ లెక్కల్లో వీక్‌ అని ఎద్దేవా చేశారు. అవిశ్వాస తీర్మానంలో ఎన్డీయే ప్రభుత్వం తప్పకుండా నెగ్గుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానం గురించి సోనియా చేసిన వ్యాఖ్యలపై స్పందనేమిటో తెలియజేయాల్సిందిగా మీడియా ప్రతినిధులు కేంద్రమంత్రిని అడిగారు.

"సోనియాజీ లెక్కల్లో వీక్‌. 1996లో కూడా వాళ్లు ఇదే విధంగా లెక్కించారు. కానీ ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. వారి లెక్కలు మరోసారి తప్పుతాయి. పార్లమెంటు లోపలా, బయటా మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉంది. అన్ని వైపుల నుంచి మోదీకి మద్దతు ఎలా వస్తుందో మీరందరూ చూస్తారు" అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు మోదీ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని కాంగ్రెస్‌ విశ్వాసం వ్యక్తం చేసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి సరైన సంఖ్యా బలం లేదు కదా అని విలేకర్లు నిన్న సోనియాను ప్రశ్నించగా.. ‘మాకు సంఖ్యా బలం లేదని ఎవరు చెప్పారు?’ అని ప్రశ్నించారు.





Untitled Document
Advertisements