భువి.. ఇంగ్లాండ్ టూ ఇండియా..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 04:20 PM

భువి.. ఇంగ్లాండ్ టూ ఇండియా..

ఇంగ్లాండ్, జూలై 19 : ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ భువనేశ్వర్ కుమార్ భారత్‌కి తిరిగి పయనం కానున్నాడు. ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు బుధవారం జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. గాయం కారణంగా భువీ పేరుని ఆ జాబితాలో చేర్చకుండా పరిశీలనలో ఉంచారు. కానీ.. తాజాగా అతడ్ని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించడంతో.. ఈ స్వింగ్ బౌలర్‌ భారత్‌కి వచ్చేస్తున్నాడు.

ఇంగ్లాండ్ పర్యటన ఆరంభం నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్.. ఇటీవల ముగిసిన మూడో వన్డేలో నొప్పి తీవ్రతరం కావడంతో బౌలింగ్ చేసేందుకు చాలా ఇబ్బందిపడ్డాడు. దీంతో.. ఆగస్టు 1వరకు విశ్రాంతినిస్తే సరిపోతుందని తొలుత భావించారు. ఈ నేపథ్యంలోనే టెస్టు జట్టులో భువీ పేరుని చేర్చనప్పటికీ.. త్వరలోనే అతనిపై నిర్ణయం తీసుకుంటామని బుధవారం బీసీసీఐ ప్రకటించింది. కానీ.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో విశ్రాంతి ఇవ్వాలని తాజాగా బోర్డు అధికారులు నిర్ణయం తీసుకొంది.

Untitled Document
Advertisements