ఆలింగనం వెనుక ఆ౦తర్యమేంటి..!

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 03:05 PM

ఆలింగనం వెనుక ఆ౦తర్యమేంటి..!

ఢిల్లీ, జూలై 20 : ఈ మధ్య పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమాలో.. రాష్ట్రాన్ని పాలిస్తున్న ఓ అధికార పార్టీ.. ప్రతిపక్ష పార్టీ బయటకి మాటల యుద్ధం చేస్తూ.. తెర వెనుక రెండు పార్టీలు ఒకటేనని ముఖ్యమంత్రి సాక్షిగా బయటపడుతుంది. రాజకీయాల్లో అధికార, విపక్షాలు విమర్శలు చేసుకుంటూ ఉండటం సర్వ సాధారణమే. ఇది ప్రజలకు కనిపించే చిత్రం. అంతరంగంగా ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో భాగంగా ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. అదేంటంటే.. ప్రధాని మోదీని విపక్ష కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకున్నారు. రాహుల్ చర్యతో మోదీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.

అవిశ్వాస తీర్మానంపై మొదట చర్చను టీడీపీ తరఫున గల్లా జయదేవ్‌ ప్రారంభించారు. ఆయన దాదాపు గంటసేపు ప్రసంగించగా.. అనంతరం బీజేపీ తరపున జబల్‌పూర్‌ ఎంపీ రాకేష్‌ సింగ్‌ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ విభజన చేసిన కాంగ్రెస్ తో టీడీపీ చేతులు కలిపి శాపగ్రస్థమైందన్నారు. తర్వాత కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చర్చను కొనసాగిస్తూ, బీజేపీ, మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో గందరగోళం చెలరేగగా.. స్పీకర్‌ పది నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ తన విమర్శనాస్త్రాలను కొనసాగించారు. తన ప్రసంగం అయిన తర్వాత రాహుల్ గాంధీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకెళ్లి ఆయనతో కరచాలనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ఏం జరుగుతుందో అర్ధం చేసుకోనేలోపు రాహుల్ వెళ్తుండగా మోదీ ఆయను పిలిచే ఎదో చెప్పి కరచాలనం ఇచ్చి, భుజం తట్టారు. మరి ఈ ఆలింగనం వెనుక ఆ౦తర్యమేమిటో వారికే తెలియాలి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పుడు ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్‌లో రాహుల్ చర్య హాట్ టాపిక్‌గా అయ్యింది. ఆయన స్టంట్ సభలో ఉన్న సభ్యులందర్నీ షాక్‌కు గురిచేసింది. ఆ చర్య తర్వాత కెమెరాలన్నీ రాహుల్ వైపే ఫోకస్ చేశాయి. ప్రసంగం ముగించిన రాహుల్.. తన సీట్లో కూర్చున్న తర్వాత కూడా ముసిముసి నవ్వులు, తనవైన హావభావాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ చర్యపై ప్రజల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోదీ పాలనను రాహుల్ గాంధీ అంగీకరించారా? అంటూ చురకలు వేస్తున్నారు. కాంగ్రెస్ సభ్యులు ప్రధాని రాహుల్ స్పీచ్ కు మెచ్చుకున్నారని చెబుతున్నారు.





Untitled Document
Advertisements