ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ వెనుక అసలు కారణం

     Written by : smtv Desk | Fri, Jul 27, 2018, 05:33 PM

ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ వెనుక అసలు కారణం

చెన్నై, జూలై 27 : డీఎంకే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ అత్యవసర భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలందరినీ గోపాలపురంలోని తన నివాసానికి రావాలని స్టాలిన్‌ కబురు పెట్టడంతో వారంతా అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆయన వారిలో సమావేశమయ్యారు.

మరోవైపు కరుణానిధి అనారోగ్యంపై వస్తున్న వార్తలతో ఆయన అభిమానులు, డీఎంకే కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఉదయం నుంచి గోపాలపురంలోని ఆయన నివాసానికి పెద్దయెత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అన్నాడీఎంకే సహా ఇతర పార్టీల నేతలు కరుణానిధి ఇంటికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి శుక్రవారంతో 50వ వసంతంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. కరుణానిధి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని నడిపించారని... ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడవాలని సూచించారు.

కరుణానిధి అధ్యక్షతన పార్టీ ఘన విజయాలు నమోదు చేసిందన్నారు. ప్రజా జీవితంలో 80 ఏళ్లు, పార్టీ పత్రిక సంపాదకుడిగా 75 ఏళ్లుగా కొనసాగుతున్నారని.. కళా రంగంలో 70ఏళ్లు, శాసనసభలో 60 ఏళ్లుగా ఉంటూ అరుదైన గుర్తింపు పొందారని తెలిపారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసిన రాష్ట్రపతి, ప్రధాని, ఇతర ప్రముఖులందరికీ స్టాలిన్‌ కృతజ్ఞతలు తెలిపారు.





Untitled Document
Advertisements