గ్రహణం వచ్చినా సరే, ఈ గుడిని మాత్రం మూసేయరు!!

     Written by : smtv Desk | Fri, Jul 27, 2018, 05:46 PM

గ్రహణం వచ్చినా సరే, ఈ గుడిని మాత్రం మూసేయరు!!

శ్రీకాళహస్తీ, జూలై 27: సూర్య గ్రహణం, చంద్రగహణం ఇలా ఏ గ్రహణం పట్టినా.. ఆ రోజు గుడులన్నీ మూసేయాల్సిందే. గ్రహణం వీడిన తర్వాతే దేవాలయాలను శుద్ధి చేసి తెరిచి మళ్లీ భక్తులను అనుమతిస్తారు. ఇది ఏనాటి నుంచో వస్తున్న ఆచారం.

కాని.. ఒక గుడి మాత్రం ఏ గ్రహణం పట్టినా మూతపడదు. అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు, ఇతర ఏ కారణాల చేతనైనా ఆ గుడిని మాత్రం మూసేయరు. ఇంతకీ అది ఏగుడి అంటారా? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న శ్రీకాళహస్తి దేవస్థానం. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా కొలుస్తారు. ఈ గుడిని గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పిలుస్తుంటారు.

గ్రహణం సమయంలోనూ ఈ దేవాలయాన్ని తెరిచే ఉంచుతారు. ఈ ఆలయంలో కొలువైన శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణ సమయంలో అభిషేకాలు నిర్వహిస్తుంటారు. శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యచంద్రులు, అగ్ని భట్టారకుడు, నవ గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులను దర్శనమిస్తుండటం వల్ల రాహువు, కేతువులు ఈ ఆలయంలోకి ప్రవేశించలేవు. అందుకే శ్రీకాళహస్తిలో భక్తులు రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు.

సాధారణంగా సూర్య గ్రహణం ప్రారంభం సమయంలో, చంద్ర గ్రహణం పూర్తయిన తర్వాత గుడిలో శాంతి అభిషేకాలు నిర్వహిస్తారు. అందుకే.. ఈ గుడిలోకి గ్రహణం సమయంలోనూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇవాళ వచ్చే సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా రాత్రి ఒంటి గంట నుంచి సంకల్ప పూజలను నిర్వహించనున్నారు. ఉదయం నాలుగు గంటల్లోపు ఈ గ్రహణ కాల అభిషేకాలు నిర్వహిస్తారు.

Untitled Document
Advertisements