యూనిఫాంలో ఉండటంపై పలువురి అభ్యంతరం

     Written by : smtv Desk | Sat, Jul 28, 2018, 02:47 PM

యూనిఫాంలో ఉండటంపై  పలువురి అభ్యంతరం

గోర్‌ఖ్‌పూర్‌, జూలై 28: గురుపౌర్ణమి సందర్భంగా గురువులను పూజించడం చూస్తుంటాం. అయితే తన గురువు ముఖ్యమంత్రేనని సీఎంకు పూజలు చేశారో సీనియర్‌ పోలీసు అధికారి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన సీనియర్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ సింగ్‌.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు పూజలు చేసి ఆయన నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను స్వయంగా ప్రవీణ్‌ కుమార్‌ తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్టు చేశారు.

‘గురుపౌర్ణమి సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వద్ద ఆశీర్వాదం తీసుకున్నాను. ఆయన ముఖ్యమంత్రే కాదు.. గోరఖ్‌పూర్‌ ఆలయానికి ప్రధాన అర్చకులు’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ప్రవీణ్‌కుమార్‌ ఆ ఫొటోలను షేర్‌ చేశారు. ఒక ఫొటోలో ప్రవీణ్‌ మోకాళ్లపై కూర్చుని యోగి ఆదిత్యనాథ్‌కు నమస్కరిస్తుండగా.. మరో ఫొటోలో యోగికి బొట్టు పెడుతూ, పూలమాల వేస్తున్నట్లుగా ఉంది.

కాగా.. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు ఫొటోల్లో ప్రవీణ్‌కుమార్‌ యూనిఫాంలో ఉండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కొందరు మాత్రం అందులో తప్పేముందంటూ ప్రవీణ్‌కు మద్దతు పలుకుతున్నారు.

మొన్నామధ్య దిల్లీలో ఓ పోలీస్‌ అధికారి యూనిఫాంలో ఉండి మహిళా సాధువు వద్ద ఆశీర్వాదం తీసుకున్న ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫొటో కూడా వివాదాస్పదమవడంతో సదరు పోలీసును మరో చోటుకు బదిలీ చేశారు.





Untitled Document
Advertisements