భాజపా ట్వీట్‌పై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

     Written by : smtv Desk | Sat, Jul 28, 2018, 06:21 PM

భాజపా ట్వీట్‌పై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు

హైదరాబాద్‌: అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల అమలులో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజమే. తాము ఇచ్చిన నిధులను రాష్ట్రాలు తమ గొప్పలుగా చెప్పుకుంటాయని కేంద్రం ఆరోపణలు చేయడం కూడా మామూలే. కేంద్ర పాలకులు ఏం చేయకపోయినా తామే అన్నీ చేస్తున్నామని చెప్పుకుంటున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వాలు అనడం పరిపాటే. ఇదే క్రమంలో ప్రజలకు తాము చేసే పనులు చెప్పుకోవడం సాధారణమే. అయితే, సిరిసిల్ల జిల్లాలోని వీర్నెపల్లి గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కార్పోరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఓ సంస్థ నిధులు వెచ్చించి రైల్వే బోగీల తరహాలో పాఠశాలను తీర్చిదిద్దింది. ఇదే విషయాన్ని సిరిసిల్ల కలెక్టర్‌ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌చేశారు. దీన్ని ప్రశంసిస్తూ కేటీఆర్‌ ఈ రోజు ట్వీట్‌ చేశారు. అయితే, దాన్ని పొరపాటుగా అర్థం చేసుకున్న కొందరు భాజపా ట్విటర్‌ విభాగం ప్రతినిధులు సీఎస్‌ఆర్ ‌నిధులను దక్షిణ మధ్య రైల్వే నిధులుగా పొరబడ్డారు. ద.మ రైల్వే నిధులతో పాఠశాలను అభివృద్ధి చేశారంటూ ట్వీటారు. ఈ భూమ్మీద జరిగే ప్రతి పనీ తమ వల్లే జరిగిందని గొప్పలు చెప్పుకుంటారంటూ భాజపాకు కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు. ఆ తర్వాత తేరుకున్న భాజపా విభాగం తమ ట్వీట్లను తొలగించడం కొసమెరుపు.

Untitled Document
Advertisements