గుంటూరులో డీవీసీ ఆస్పత్రిని ప్రారంభించిన ఏపీ సీఎం

     Written by : smtv Desk | Tue, Aug 28, 2018, 05:55 PM

గుంటూరులో డీవీసీ ఆస్పత్రిని ప్రారంభించిన ఏపీ సీఎం

గుంటూరు:గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీ ఆవరణలో ధూళిపాళ్ల వీరయ్య చౌదరి స్మారక ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రూ.11 కోట్లతో ఏర్పాటు చేసిన డీవీసీ ఆస్పత్రిని సీఎం ప్రారంభించారు.మాజీ మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వీరయ్య చౌదరి జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన బాటలో నరేంద్ర శాశ్వత అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో్ మంచి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారని ప్రశంసించారు. రాష్ట్రానికి డీవీసీ ఆస్పత్రి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చే బీమా, ఇతర పథకాలన్నీ డీవీసీకి వర్తింపజేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రెండు కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

వ్యవసాయం లాభసాటిగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం.. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. కోస్తాలో తుఫాన్లు, రాయలసీమలో కరవు.. రెంటినీ సమర్థంగా ఎదుర్కొంటున్నామన్నారు. కోటి ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సీఎం చెప్పారు. రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎంపీ గల్లా జయదేవ్‌, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Untitled Document
Advertisements