వచ్చే ఏడాదిలో నీట్‌, జేఈఈ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

     Written by : smtv Desk | Thu, Aug 30, 2018, 07:07 PM

వచ్చే ఏడాదిలో నీట్‌, జేఈఈ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

దిల్లీ: ఐఐటీ, వైద్య విద్యను అభ్యసించాలని కలలుగంటున్న విద్యార్థులకు శుభవార్త. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఊరట కల్గిస్తూ జేఈఈ, నీట్‌ పరీక్షల కోసం ఉచితంగా శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వచ్చే ఏడాది నుంచి నీట్‌, జేఈఈకి సన్నద్ధమయ్యేవారి కోసం ఉచిత శిక్షణ కేంద్రాలను ప్రారంభించనుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న టెస్ట్‌ ప్రాక్టీస్‌ సెంటర్లను శిక్షణ కేంద్రాలుగా మార్చాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్ణయించినట్లు కొన్ని మీడియా వర్గాలు వెల్లడించాయి.

నీట్‌, జేఈఈలతో పాటు యూజీసీ-నెట్‌, మేనేజ్‌మెంట్‌, ఫార్మా ప్రవేశ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. సెప్టెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా 2,697 ప్రాక్టీస్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు ఇటీవల ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ సెంటర్లను వచ్చే ఏడాది నుంచి టీచింగ్‌ సెంటర్లు(శిక్షణ కేంద్రాలు)గా మార్చాలని నిర్ణయించినట్లు తాజాగా సంబంధిత అధికారులు మీడియాకు తెలిపారు. ఫీజులు కట్టి శిక్షణ తీసుకోలేని పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సదరు అధికారులు పేర్కొన్నారు. ‘ఈ కేంద్రాల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కోచింగ్‌ తీసుకోలేని విద్యార్థులకు ఈ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతాయి’ అని అధికారులు వెల్లడించారు.

ఈ కేంద్రాల్లో కోచింగ్ ఇవ్వడంతో పాటు విద్యార్థులకు మాక్‌ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తారు. వచ్చే ఏడాది మే తర్వాత నుంచి ఈ ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నట్లు సదరు అధికారులు తెలిపారు. అయితే, ఈ ఉచిత శిక్షణ కోసం విద్యార్థులు ముందుగా ప్రాక్టీస్‌ సెంటర్లలో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. దీని గురించి ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.





Untitled Document
Advertisements