కేరాఫ్ కంచరపాలెం రివ్యూ

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 04:31 PM

కేరాఫ్ కంచరపాలెం రివ్యూ

సమర్పణ: రానా దగ్గుబాటి

నిర్మాణ సంస్థ: సురేశ్‌ ప్రొడక్షన్స్‌

నటీనటులు: సుబ్బారావు, రాధా బెస్సి, మోహన్‌ భగత్‌, ప్రవీణ పరుచూరి, కార్తీక్‌ రత్నం, ప్రణీత పట్నాయక్‌, కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు తదితరులు.

సంగీతం: స్వీకర్‌ అగస్థి

కూర్పు: రవితేజ

ఛాయాగ్రహణం: వరుణ్‌ చపేకర్‌, ఆదిత్య జవ్వాది

నిర్మాత: విజయ ప్రవీణ పరుచూరి

దర్శకత్వం: వెంకటేశ్‌ మహా

కథ :

నాలుగు జంటల ప్రేమ కథ కేరాఫ్ కంచరపాలెం , తన క్లాస్ మేట్ అయిన సునీత (నిత్యశ్రీ ) అంటే సుందరం (కేశవకర్రి ) కి చాలా ఇష్టం , జిమ్ లో పనిచేసే టీనేజ్ కుర్రాడైన జోసెఫ్ (కార్తీక్ రత్నం ) భువనేశ్వరి (ప్రణీతా పట్నాయక్ ) అనే బ్రాహ్మణ యువతిని ప్రేమిస్తాడు . వైన్ షాప్ లో పనిచేసే గడ్డం ( మోహన్ భగత్ ) వేశ్య అయిన సలీమా (విజయ ప్రవీణ ) కళ్ళు చూసి ప్రేమలో పడతాడు . 49 సంవత్సరాల రాజు ( సుబ్బారావు ) గవర్నమెంట్ ఆఫీసులో అటెండర్ అయితే 49 ఏళ్ళు వచ్చినప్పటికీ పెళ్లి కాకపోవడంతో ఊళ్ళో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు అలాంటి రాజు తన ఆఫీసర్ అయిన రాధ (రాధా బెస్సి ) ని ప్రేమిస్తాడు . ఇలా నాలుగు ప్రేమల కథ కంచరపాలెంలో
ఎలాంటి మలుపులకు కారణం అయ్యింది అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

న‌టీన‌టులు:
రాజు పాత్ర‌లో సుబ్బారావ్ జీవించాడు. ఆయ‌నే సినిమాకు ప్రాణం. 50 ఏళ్లొచ్చినా పెళ్లి కాని వాడిగా అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు కూడా పూయించాడు సుబ్బారావ్. ఇక రాధ పాత్ర‌లో రాధాబెస్సీ అద్భుతంగా న‌టించారు. ఇక సినిమాలో ఉన్న ప్ర‌తీ ఒక్క‌రు కొత్తవాళ్లే అయిన కార‌ణంగా ప్ర‌తీ పేరును ఇక్క‌డ చెప్ప‌డం క‌ష్టం. కానీ ఒక్కొక్క‌రు త‌మ పాత్ర‌కు మాత్రం జీవం పోసారు. నిజ‌మైన న‌టుల‌ను పెట్టుకుని ఉంటే క‌చ్చితంగా ఈ సినిమాకు ఇంత అద‌న‌పు ఆక‌ర్ష‌ణ వ‌చ్చేది మాత్రం కాదు.

విశ్లేషణ :

ఓ గ్రామంలోని వ్యక్తులు వారి జీవితాలే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వెంకటేష్‌ మహా.. ఎక్కడా సినిమాటిక్‌గా చూపించే ప్రయత్నం చేయలేదు. సినిమాను పూర్తిగా సహజంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయో, ఎలా మాట్లాడతాయో అలాగే తెర మీద ఆవిష్కరించాడు. అదే సమయంలో సమాజంలో ఉన్న అంతరాలు, కులమత భేదాలు వాటి పర్యవసానాలను మనసును తాకేలా చూపించాడు. కమర్షియల్‌ లెక్కల కోసం హాస్య సన్నివేశాలను ఇరికించకుండా.. లీడ్‌ క్యారెక్టర్స్‌ ప్రవర్తన నుంచే కామెడీ పండించి ఆకట్టుకున్నాడు. అందుకే సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడికి కంచరపాలెంలో అక్కడి ప్రజలతో కాసేపు గడిపిన భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్న దర్శకుడు నెమ్మదిగా కథ నడిపించాడు. నాలుగు కథలను ప్యారలల్‌గా నడిపించిన దర్శకుడు క్లైమాక్స్‌ ట్విస్ట్‌తో ఆడియన్స్‌కు షాక్‌ ఇచ్చాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

సినిమా అంటే ఎక్కడో కమర్షియల్‌ విలువలతో పాటలు, ఫైట్స్‌ మాత్రమే కాదు... ఎమోషన్స్‌.. వాటిని చక్కగా క్యారీ చేసే సన్నివేశాలు కీలకం అని దర్శకుడు వెంకటేశ్‌ మహా గుర్తొరిగి వాటికి అనుగుణంగా సన్నివేశాలను మలుచుకుంటూ చక్కగా రాసుకున్నాడు. తెరకెక్కించే సందర్భంలోనూ మన ఊరిలో మనకు తెలిసిన ప్రేమ కథలను చూస్తున్నట్లే ఉంటుంది. అంత చక్కగా, నెటివిటీకి దగ్గరగా తెరకెక్కించాడు దర్శకుడు వెంకటేశ్‌ మహా. అతి తక్కువ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించిన తీరు అభినందనీయం. స్వీకర్‌ అగస్థి సందర్భానుసారం వచ్చే పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.

Untitled Document
Advertisements