మరో కొత్త పార్టీ !!

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 11:04 AM

మరో కొత్త పార్టీ !!

రెండు తెలుగు రాష్ట్రాలలో బీసీ జనాభా మిగిలిన వారి కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ వారికి జనాభా ప్రాతిపదికన ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడంలో కెసిఆర్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరూ నిర్లక్ష్యం చేస్తున్నారని బీసీ సంఘాల నేత మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. కనుక బీసీలకు రాజ్యాధికారం సాధించేందుకు పార్టీ పెట్టాలని తనపై బీసీ సంఘాల నుంచి ఒత్తిళ్ళు వస్తున్నాయని చెప్పారు. దీనిపై బీసీ నేతలతో చర్చలు సాగుతున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని కృష్ణయ్య చెప్పారు. ఒకవేళ పార్టీ పెట్టదలిస్తే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లోనే ముందుగా ప్రారంభిస్తామని కృష్ణయ్య చెప్పారు.

ఎన్నికలకు ముందు కొత్త పార్టీలు పుట్టుకు రావడం సర్వసాధారణమైన విషయమే. కనుక కృష్ణయ్య పార్టీ స్థాపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. కానీ పార్టీ పెట్టి దానితో ముందుకు సాగాలనే పట్టుదల ఉన్నట్లయితే ఎన్నికలకు ముందు కాక కనీసం ఏడాది ముందు స్థాపించుకొని పార్టీ నిర్మాణం చేసుకొని ప్రజలలోకి వెళ్ళాలి. అంతేకాదు అధికార పార్టీలను, కొమ్ములు తిరిగిన తమ రాజకీయ ప్రత్యర్ధి పార్టీలను డ్డీకొనగలమనే ధైర్యం, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన నిలిచి ముందుకు సాగగలమనే నమ్మకం, ఆత్మవిశ్వాసం కూడా చాలా అవసరం. జనసేన, తెలంగాణా జనసమితి, బిఎల్ఎఫ్ కూటమి ఆవిధంగానే ముందుకు సాగుతుండటం అందరూ చూస్తున్నారు. కనుక కృష్ణయ్య కూడా ఆలోచించుకొని ముందడుగు వేయడం మంచిది.

Untitled Document
Advertisements