‘జనసేన’ మొట్టమొదటి అభ్యర్థి

     Written by : smtv Desk | Tue, Sep 11, 2018, 05:46 PM

 ‘జనసేన’ మొట్టమొదటి అభ్యర్థి

ఎన్నికల బరిలోకి దిగుతామని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందుకేసి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన తరుపు‌న పోటీ చేసే మొదట అభ్యర్థిని ఆయన మంగళవారం ప్రకటించారు. ఎన్నికల్లో మొట్టమొదటి బీఫారం పితాని బాలకృష్ణకు కేటాయిస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మాజీ నేత పితాని బాలకృష్ణకు పార్టీ కండువా కప్పి ‘జనసేన’లోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు

అనంతరం, పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, మొట్టమొదటి బీ ఫారమ్ ఇచ్చేది పితాని బాలకృష్ణ కేనని, ఇంకెవ్వరికీ ఇవ్వనని అన్నారు. పితాని బాలకృష్ణ కానిస్టేబుల్ గా చేశారని, తన తండ్రి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం చేశారని, తమది ‘పోలీస్ కులం’ అని చెప్పి నవ్వులు చిందించారు. జనసేన తరుపున శాసనసభ సభ్యుడిగా పోటీచేసే అవకాశాన్ని పొందిన తొలి నేతగా పితాని బాలకృష్ణను ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అభినందనల్లో ముంచెత్తుతున్నారు.

తనపై నమ్మకంతో పితాని జనసేనలోకి వచ్చారని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదని పవన్ వివరించారు. ‘నేను మాట ఇస్తే.. వెనక్కి తీసుకోను. నష్టం వచ్చినా సరే ముందుకే వెళ్తా’ అని పవన్ అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం వల్ల తాను పితానికి టికెట్ ఇస్తానని చెప్పడంలేదని. ఆయన పట్టుదలను చూసి ఇస్తున్నానని పవన్ స్పష్టం చేశారు. అన్ని కులాలు, జాతుల వారికి పితాని న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని తెలిపారు.





Untitled Document
Advertisements