ఇదే ఆఖరుసారి: మోత్కుపల్లి

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 11:05 AM

ఇదే ఆఖరుసారి:  మోత్కుపల్లి

సుమారు మూడున్నర దశాబ్ధాలపాటు టిడిపిలో తిరుగులేని నేతగా ఉన్న మోత్కుపల్లి నర్సింహులు, తెలంగాణాలో టిడిపిని టిఆర్ఎస్‌లో విలీనం చేసేయాలని నోరుజారడంతో అవమానకర పరిస్థితులలో పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. ఆ తరువాత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తూ కొన్ని రోజులు కాలక్షేపం చేసేరు కానీ అవి తన రాజకీయ భవిష్యత్ కు ఏమాత్రం ఉపయోగపడవనే సంగతి కాస్త ఆలస్యం తెలుసుకొని తదుపరి కార్యాచరణను గురువారం ప్రకటించారు.

ఈరోజు తుర్కపల్లి మండల కేంద్రంలో జెఏం ఫంక్షన్ హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో తాను గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జిల్లాకు చేసిన సేవల గురించి చెప్పుకొన్నాక ఈసారి ఆలేరు నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయాలనుకొంటున్నట్లు ప్రకటించారు. తాను ఇదే ఆఖరుసారి పోటీ చేస్తున్నానని, ఇకపై మళ్ళీ ఎన్నడూ ఎన్నికలలో పోటీ చేయబోనని కనుక ఆలేరు నియోజకవర్గం ప్రజలు ఎప్పటిలాగే తనను ఈసారి కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని మోత్కుపల్లి విజ్నప్తి చేశారు.

ఈనెల 27న యాదగిరి గుట్టలోని పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో మోత్కుపల్లి శంఖారావ సభ నిర్వహించబోతున్నానని దానికి తన అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చి తనను ఆశీర్వదించాలని కోరారు. తాను పదవులు అధికారం కోసం పోటీ చేయడం లేదని కేవలం ఆలేరు ప్రజల గౌరవం కోసమే పోటీ చేస్తున్నాని తెలిపారు. తనకు ఈ చివరి అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేసుకొని వారి రుణం తీర్చుకొంటానని మోత్కుపల్లి నర్సింహులు అభ్యర్ధించారు.





Untitled Document
Advertisements