'నన్ను దోచుకుందువటే’ రివ్యూ

     Written by : smtv Desk | Fri, Sep 21, 2018, 06:16 PM

'నన్ను దోచుకుందువటే’  రివ్యూ

చిత్రం: ‘నన్ను దోచుకుందువటే’
న‌టీన‌టులు: సుధీర్‌బాబు, న‌భా న‌టేష్‌, నాజర్‌, తులసి
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌
ద‌ర్శ‌క‌త్వం: ఆర్.‌ఎస్‌. నాయుడు
నిర్మాత‌లు: సుధీర్‌బాబు

“సమ్మోహనం” చిత్రంతో ఇప్పటికే ఓ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో సుధీర్‌బాబు అదే సినిమా సెట్‌లో ఉండగా సుధీర్‌బాబు సొంత బ్యానర్‌పై నన్ను దోచుకుందువటే చిత్రాన్ని నిర్మించారు. నూతన దర్శకుడు ఆర్.ఎస్.నాయకుడు దర్శకత్వంలో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది నభ నటేష్. యువతను ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలో నభ నటేష్ గ్లామరస్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ట్రైలర్, టీజర్ ఆకట్టుకునేలా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. యువత, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రంపై ఆసక్తిగా ఉన్నారు. సుధీర్‌బాబు సొంత బ్యానర్‌లో నిర్మించిన ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం గురించి మరింత తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

క‌థ :
కార్తీక్(సుధీర్‌బాబు)ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా ఉంటాడు. కెరీర్‌లో తనకంటూ ఓ గోల్, టార్గెట్‌ను పెట్టుకుని వాటికి తగ్గట్టుగా కెరీర్‌ కోసం దేనికీ లొంగకుండా ముందుకు సాగుతూ ఉంటాడు. బాస్‌గా తన దగ్గర ఉండే ఉద్యోగులపై రూల్స్ అంటూ టార్చర్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా కంపెనీలో ప్రమోషన్‌ సాధించి అమెరికా వెళ్లాలని ఆశపడుతుంటాడు కార్తీక్‌. ఆ కలను నిజం చేసుకునేందుకు ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా కష్టపడుతుంటాడు. ఈ సమయంలో కొన్ని పరిస్థితుల కారణంగా కార్తీక్‌ తన తండ్రి(నాజర్‌)తో ఓ అబద్ధం చెప్పాల్సి వస్తుంది. తాను సిరి అనే అమ్మాయిని ప్రేమించానని తండ్రితో చెపుతాడు కార్తీక్‌. దీంతో కార్తీక్‌ తండ్రి, సిరిని కలిసేందుకు హైదరాబాద్‌ వస్తాడు.

తప్పనిసరి పరిస్థితుల్లో షార్ట్‌ ఫిలింస్‌లో నటించే ఇంజనీరింగ్‌ స్టూడెంట్‌ మేఘన(నభ నటేష్‌)ను తన గర్ల్‌ ఫ్రెండ్‌గా నటించేందుకు ఒప్పందం చేసుకుంటారు కార్తీక్‌. కానీ మేఘన మంచితనం, ప్రేమ నచ్చి వారిద్దరి పెళ్లికి కార్తీక్‌ వాళ్ల నాన్న అంగీకరిస్తాడు. అదే సమయంలో కార్తీక్‌కి కూడా మేఘన మీద ఇష్టం కలుగుతుంది. మేఘన కూడా కార్తీక్‌ను ఇష్టపడుతుంది. కానీ మేఘనతో ఎక్కువ సమయం గడుపుతుండటంతో కార్తీక్‌కు ఆఫీస్‌లో ఓ సమస్య ఎదురవుతుంది. దీంతో తన గోల్‌కు దూరమవుతున్నా అన్న భయంతో మేఘనను దూరం పెడతాడు. అదే సమయంలో మేఘనకు దూరమవుతున్నందుకు బాధపడుతుంటాడు. చివరకు కార్తీక్‌ ఏ నిర్ణయం తీసుకున్నాడు..? కార్తీక్ తన టార్గెట్ రీచ్ అవుతాడా? లేదా అనేది మిగతా కథ.

న‌టీన‌టులు:
ఈ సినిమాలో హీరో సుధీర్‌బాబు తన నటనతో మరోసారి మెప్పించారు. తన ఇమేజ్‌కు తగ్గట్టుగా రొమాంటిక్‌ కామెడీతో అలరించాడు. ముఖ్యంగా ఆఫీస్‌లో ఎంప్లాయిస్‌లు టార్చర్‌ పెట్టే సీన్స్‌లో సుధీర్‌ నటన సూపర్బ్. హీరోయిన్‌ నభ నటేష్ తెలుగులో తొలి సినిమా అయినా మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచింది. తన గ్లామర్ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. నటన పరంగా పరవాలేదనిపించిన నభ, కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకుంది.హీరో తండ్రి పాత్రలో నాజర్‌ ఒదిగిపోయారు. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్‌ సీన్స్‌లో నాజర్‌ నటన కంటతడిపెట్టిస్తుంది. ఇతర కీలక పాత్రల్లో పృథ్వీ, తులసీ, సుదర్శన్‌ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ

దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు రెగ్యులర్ లవ్‌ స్టోరీని చూపించే ప్రయత్నం చేయకుండా కెరీర్‌, లవ్ మధ్య ఓ అబ్బాయి ఆలోచన ఎలా ఉంటుంది, దీనిలో వేటికి ప్రాధాన్యమివ్వాలి అనే కోణంలో ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. సినిమా మొత్తం కార్తీక్ యాటిట్యూడ్‌తో కామెడీ ప్రధానంగా నడుస్తుంది. సినిమాలో కామెడీతో పాటు, లవ్, ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. ఈ సినిమా దర్శకుడిగా ఆర్‌.ఎస్. నాయుడు సక్సెస్ అయినట్టే. సమ్మోహనం సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న సుధీర్‌ బాబు నిర్మాతగా మారేందుకు హార్ట్ టచింగ్‌ ఎంటర్‌టైనర్‌ను ఎంచుకున్నాడు. అయితే కథనం ఇంకాస్త వేగంగా ఉంటే బాగుండనిపిస్తుంది. ద్వితీయార్థానికి వచ్చే సరికి దర్శకుడు మరింత స్లో అయ్యాడు. ప్రతీ సన్నివేశం నెమ్మదిగా సాగుతూ ఆడియన్స్‌ను ఇబ్బంది పెడుతుంది. ప్రీక్లైమాక్స్‌లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ ఆకట్టుకుంటాయి. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం కూడా సినిమాకు పర్ఫెక్ట్‌ గా సెట్ అయ్యింది. పాటలు పరవాలేదనిపించినా, నేపథ్య సంగీతం సీన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. సురేష్‌ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. ఎడిటింగ్‌ నిరాశపరిచింది. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగటం సినిమాకు మైనస్‌ అయ్యింది. సుధీర్‌ బాబు సొంత సినిమా కావటంతో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా క్వాలిటీ అవుట్‌పుట్‌ ఇచ్చేందుకు కష్టపడ్డాడు.నేపథ్య సంగీతం సీన్స్‌ను మరింతగా ఎలివేట్ చేసింది. మొత్తంగా సినిమా యూత్‌ని, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది

హైలైట్స్
సుధీర్‌ బాబు యాక్టింగ్‌
కామెడీ , ఎమోషనల్‌ సీన్స్‌

బ్యాక్‌డ్రాప్స్
సన్నివేశాలు నెమ్మదిగా సాగటం

చివరిగా : ఫైనల్‌గా ఇది యూత్‌ ఎంటర్‌ టైనర్‌





Untitled Document
Advertisements