కెసిఆర్‌ పాలనను అంతమొందిస్తాము

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 10:05 AM

 కెసిఆర్‌ పాలనను అంతమొందిస్తాము

రాష్ట్రంలో ఎన్నికల గంట మ్రోగినప్పటి నుంచి కాంగ్రెస్‌ నేతల పాతకేసులు తిరుగదోడుతూ కాంగ్రెస్ పార్టీని కట్టడిచేయడానికి సిఎం కెసిఆర్‌ చేస్తున్న ప్రయత్నాలపై టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పార్టీని ఎన్నికలలో ఎదుర్కోలేకనే సిఎం కెసిఆర్‌ ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారు. అయితే ఇటువంటి బెదిరింపులకు కేసులకు కాంగ్రెస్‌ నేతలు ఎవరూ భయపడబోరు. ఈసారి ఎన్నికలలో టిఆర్ఎస్‌ను మట్టి కరిపించి కెసిఆర్‌ పాలనను అంతమొందిస్తాము. ఇక కెసిఆర్‌కు కేవలం 60 రోజులు మాత్రమే సమయం మిగిలుంది. ఆ తరువాత అధికారంలోకి వచ్చేది మేమే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత కెసిఆర్‌ ఇప్పుడు మాపై చేస్తున్నవాటికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాము,” అని అన్నారు.

అధికారంలో ఉన్నవారు ప్రజాస్వామ్యవిలువలను పక్కన పెట్టి, తమ అధికారబలంతో రాజకీయ ప్రత్యర్ధులను అణచివేసి పైచేయి సాధించాలని చూస్తే ఏమవుతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలే స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు టిఆర్ఎస్‌ చేస్తున్నదే రేపు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కనుక ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలు ఇబ్బంది పడితే అప్పుడు టిఆర్ఎస్‌ నేతలు ఇబ్బంది పడక తప్పదు. ఎన్నికలలో విజయం సాధించడానికి ప్రజల ఆధారణ ఉంటే సరిపోతుంది. టిఆర్ఎస్‌కు అది పుష్కలంగా ఉంది. కనుక ప్రజలను నమ్ముకొని ముందుకు వెళ్ళి ఘనా విజయం సాధిస్తే చాలా గొప్పగా, హుందాగా ఉంటుంది. కాంగ్రెస్‌ నేతల అక్రమాల గురించి టిఆర్ఎస్‌ నేతలు చెపుతున్నవి ప్రజలు ఎంత శ్రద్దగా వింటున్నారో అలాగే ఈ కుట్ర రాజకీయాల గురించి కాంగ్రెస్‌ నేతల వధానాలను ప్రజలు అంతే శ్రద్దగా వింటున్నారని మరిచిపోకూడదు. తమకు సవాలు విసురుతున్న కాంగ్రెస్‌ నేతలను ఏదోవిధంగా అణచివేయాలని చూస్తే, ప్రజలలో టిఆర్ఎస్‌ పట్ల వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతి పెరిగే అవకాశం ఉంటుందని మరిచిపోకూడదు.





Untitled Document
Advertisements