కేసీఆర్ నుంచి ఫోన్ కూడా లేదు: బాబూ మోహన్

     Written by : smtv Desk | Sun, Sep 30, 2018, 11:20 AM

కేసీఆర్ నుంచి ఫోన్ కూడా లేదు:  బాబూ మోహన్

ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ తానెందుకు టీఆర్ఎస్‌ను వదిలి బీజేపీలో చేరాల్సింది వచ్చిందో వివరణ ఇచ్చారు. తనకు పదవులపై ఆశ లేనేలేదని, బీజేపీ నేత అమిత్ షా, మోదీల సారథ్యంలో పనిచేయాలన్న తపనతోనే పార్టీ మారానని చెప్పుకొచ్చారు. ఆయన ఢిల్లీలో ఈరోజు కమలదళ తీర్థం పుచ్చుకున్నాక విలేకర్లతో మాట్లాడారు. పనికిరానోణ్ని.. అంటూ తనదైన శైలిలో ముచ్చటించారు.

‘ఎన్టీఆర్ వల్లే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నేను అబద్ధాలాడను.. రాజకీయాలను పనికిరానని అనుకున్నాను. కానీ మూడు సార్లు ఎమ్మెల్యేనయ్యాను. మంత్రిగా కూడా పనిచేశాను. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్, హరీశ్‌రావులు పిలిస్తేనే టీఆర్ఎస్‌లో చేరాను. ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను.. కానీ నాకు టికెట్ ఇవ్వలేదు. 105 మందిలో నేనొక్కణ్నే పనికిరానోడినా? అభ్యర్థుల జాబితా చూశాక చాలా బాధపడ్డాను. ఎందుకు టికెట్ ఇవ్వలేదని కేటీఆర్‌ను అడిగాను.. సమాధానం లేదు. 25 రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. కేసీఆర్ నుంచి ఫోన్ కూడా లేదు.. ఎన్ని మెసేజ్‌లు పెట్టినా జవాబు లేదు. బీజేపీలో చేరాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ అనుమానం ఉండేది. నేను టీఆర్ఎస్‌లో పనికిరానివాడిని… మరి బీజేపీలో పనికొస్తానా? అంటూ ఆలోచిస్తున్న సమయంలో అమిత్ షా ఆహ్వానించారు. తెలంగాణతోపాటు ఏపీలోనూ పనిచేయమన్నారు…’ అని తెలిపారు. అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణల ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని, తన కొడుకు ఉదయ్‌ కూడా బీజేపీలో చేరాడని తెలిపారు.





Untitled Document
Advertisements