కుంబ్లే: ఆత్మవిశ్వాసంతో నిలబడండి

     Written by : smtv Desk | Wed, Oct 03, 2018, 01:29 PM

కుంబ్లే: ఆత్మవిశ్వాసంతో నిలబడండి

చెన్నై ,అక్టోబర్ 03: మ్యాచ్‌ ఫినిషర్‌ ఎంఎస్‌ ధోనీపై అతిగా ఆధారపడొద్దని టీమిండియా మాజీ కోచ్‌, సారథి అనిల్‌ కుంబ్లే సూచించారు. జట్టు మిడి లార్డర్‌ ఇంకా కుదురుకున్నట్టు కనిపించక పోవడంతో ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

యువ ఆటగాళ్లు మ్యాచ్‌లను ముగించేలా ప్రోత్సహిస్తూ మహీ ఆటను ఆస్వాదించాలన్నారు. తాను గొప్ప స్పిన్నర్‌ కాకున్నప్పటికీ వికెట్లు తీసినందుకు సంతోషంగా ఉందని కుంబ్లే అన్నారు. మద్రాస్‌ ఐఐటీ పూర్వవిద్యార్థుల 'సంగం'లో ఆయన మంగళవారం మాట్లాడారు. కెరీర్‌ తొలినాళ్లలో కుంబ్లే స్పిన్‌ బాగా చేయలేడన్న విమర్శలొచ్చాయి. దాంతో ఆయన మద్రాస్‌ ఐఐటీ మైదానంలో వారానికి ఐదు రోజులు స్పిన్‌ దిగ్గజం వీవీ కుమార్‌ ఆధ్వర్యంలో లెగ్‌స్పిన్‌ సాధన చేశారు. ఆ తర్వాత ఇరానీ ట్రోఫీలో ముంబయితో జరిగిన మ్యాచ్‌ జంబో కెరీర్‌ను మలుపు తిప్పింది. 'ఆ మ్యాచ్‌లో ముంబయి 190 పరుగులు ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది. మా జట్టు తిరిగి పోటీలోకి రావాలంటే ముంబయిని 100 పరుగుల్లోపే ఆలౌట్‌ చేయాలి. ఆ ఇన్నింగ్స్‌లో నేను ఏడు వికెట్లు తీశా.

ముంబయి 90 పరుగులకు ఆలౌటైంది. అంతచేసినా మా జట్టు 40 పరుగుల తేడాతో ఓడింది. మ్యాచ్‌లో నా ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసం పెంచింది. మహ్మద్‌ అజహరుద్దీన్‌, సౌరవ్‌ గంగూలీ నాకు ఇష్టమైన సారథులు. నా భార్యకు మాత్రం ధోనీ అంటే పిచ్చి ఇష్టం. ఎప్పుడు కలిసినా అతడితో ఓ ఫొటో తీసుకుంటుంది' అని కుంబ్లే పేర్కొన్నారు.

Untitled Document
Advertisements