పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం!

     Written by : smtv Desk | Sat, Oct 06, 2018, 05:25 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు 13 జిల్లాలకు చెందిన ముఖ్యనేతలతో పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఓవైపు అధికార పార్టీ నాయకులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీ నాయకులు జనాల్లోకి దూసుకెళ్తున్నారు. ప్రచారం జోరు కొనసాగిస్తున్నారు. ధర్మ పోరాట సభల పేరుతో చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లి నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరిస్తూ ఆకట్టుకునే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

మరోవైపు వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 278 రోజుల పాటు పాదయాత్ర పూర్తి చేశారు. ఇప్పటికే 3 వేల కిలోమీటర్ల మైలురాయిని దాటి ముందుకెళ్లారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పాదయాత్ర జరుపుకుంటున్న జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనతో జగన్ ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తుంది. తన పాదయాత్రలో ప్రతి చోట బహిరంగ సభలు నిర్వహిస్తూ అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తూ.. తాను చేయబోయే పథకాల గురించి వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ కూడా తనేంటో చూపించేందుకు జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గత నెలలో పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన పవన్ ఈ నెల 15న ధవళేశ్వరం బ్రిడ్జిపై కవాతు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించాలని నిర్ణయించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజల దగ్గరకు వెళ్లాలని, దానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. పవన్‌ సమక్షంలో విజయనగరం జిల్లాకు చెందిన నేతలు జనసేనలో చేరారు. నేతలకు కండువా కప్పి పార్టీలోకి పవన్ సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం రాత్రి జనసేన కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా నేతలతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.





Untitled Document
Advertisements