హైటెక్ సిటీ కి మెట్రో పరుగులు

     Written by : smtv Desk | Tue, Nov 06, 2018, 07:23 PM

ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా అమీర్ పేట నుంచి హైటెక్ సిటీకి మెట్రో రైల్ సేవలు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామని హైదరాబాద్‌ మెట్రో రైల్ ఎండి ఎన్.వి.ఎస్ రెడ్డి తెలిపారు.

ఎన్.వి.ఎస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “మొన్న ఆదివారం నాగపూర్ లో జరిగిన నగర ప్రజారవాణా వ్యవస్థల సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైల్ సంస్థ దేశంలో అత్యుత్తమ సంస్థగా ఎంపికయ్యింది. హైదరాబాద్‌ మెట్రో రైల్ ఇప్పటి వరకు వివిద విభాగాలలో మొత్తం 64 అవార్డులు స్వంతం చేసుకొని దేశంలోనే అత్యుత్తమ మెట్రో సంస్థగా నిలిచింది. ఇటీవల అమీర్ పేట-ఎల్బీ నగర్ కారిడార్ లో కూడా మెట్రో సేవలు ప్రారంభించిన తరువాత హైదరాబాద్‌ మెట్రో మొత్తం 46 కిమీలకు విస్తరించి దేశంలో మెట్రోలలో రెండవ స్థానంలో నిలిచింది. ఈ కారిడార్ లో మెట్రో సేవలు ప్రారంభించిన తరువాత రోజుకు 1.80 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ కారిడార్ కూడా అందుబాటులోకి వస్తే మెట్రోలో ప్రయాణికుల సంఖ్య ఇంకా పెరుగుతుంది” అని చెప్పారు.

అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభమయితే హైటెక్ సిటీలో పనిచేస్తున్న వేలాది మంది ఐ‌టి ఉద్యోగులకు ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. అమీర్ పేట నుంచి హైటెక్ సిటీకి చేరుకోవడానికి ప్రస్తుతం గంటకు పైగా సమయం పడుతోంది. మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే కేవలం 15-20 నిమిషాలలోగా హైటెక్ సిటీ చేరుకోవచ్చు.

Untitled Document
Advertisements