టీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు

     Written by : smtv Desk | Tue, Nov 06, 2018, 07:53 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోరంతా టీఆర్ఎస్‌దే అన్నట్లు కనిపిస్తోంది పరిస్థితి. మహాకూటమి ఇంకా సీట్ల వాటాల పంచాయతీలో తలమునకలై ఉండగా అధికార పార్టీ ముందుకు వెళ్లిపోతోంది.

ఇప్పటికే 107 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీ.. వారికి బీ–ఫారాలను కూడా ముందుగానే అందజేసే యోచనలో ఉంది. ఈ నెల 11న అభ్యర్థులకు బీ–ఫారాలను అందించే అవకాశముందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 8న కార్తీకమాసం మొదలుకానున్న నేపథ్యంలో 12వ తేదీ కార్తీక పంచమి కావడంతో మంచి ముహూర్తమని చాలామంది పార్టీ నాయకులు భావిస్తున్నారు.

ఈ నెల 12న నామినేషన్లు దాఖలు చేసేందుకు చాలామంది టీఆర్ఎస్ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగానే ముందురోజు పార్టీ బీ–ఫారాలు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సీనియర్ నేతలతో సమావేశమైన కేసీఆర్ పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

కాగా, మహాకూటమి ఈ నెల 10న తమ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే మిగిలిన 12 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే నవంబర్ 11ను ముఖ్యమంత్రి ఎంపిక చేశారని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీకి డిసెంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 11న ఎన్నికల సంఘం ఫలితాలను వెల్లడించనుంది.





Untitled Document
Advertisements