గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ అండ

     Written by : smtv Desk | Wed, Nov 07, 2018, 01:59 PM

గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ అండ

హైదరాబద్, నవంబర్ 7: స్వదేశాన్ని వొదిలి విదేశాలకు పొట్టకూటి కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలమంది కార్మికులు, ఇంజనీర్లు గల్ఫ్ దేశాలకు వెళ్ళి పనిచేస్తున్నారు. వారిలో అనేకమంది అక్కడ అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. వాటి కారణంగా కొందరు అర్దాంతరంగా వెనక్కు తిరిగి వచ్చేసి ఇక్కడ తీవ్ర ఆర్ధికసమస్యలలో చిక్కుకొని బాధలు పడుతుంటే, అవి భరించలేమనుకొన్నవారు అక్కడే గల్ఫ్ దేశాలలో ఉంటూ దుర్భరజీవితాలు గడుపుతుంటారు. అయితే వారి సమస్యల పట్ల కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు పెద్దగా శ్రద్ద చూపలేదనే చెప్పవచ్చు. ఇది గమనించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వారి సంక్షేమం కోసం ‘గల్ఫ్ భరోసా’ పేరుతో ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించింది. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిని మంగళవారం ప్రకటించారు. ఆ వివరాలు:

1. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజులలోగా సమగ్ర ఎన్నారై పాలసీని రూపొందిస్తుంది.

2. గల్ఫ్ దేశాలలో పనిచేసేవారి కోసం ప్రత్యేకంగా గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము.

3. గల్ఫ్ కార్మికుల సంక్షేమ నిధికి ఏటా రూ.500 కోట్లు నిధులు మంజూరు చేస్తాం.

4. రాష్ట్రంలో వ్యవసాయ భూములున్న గల్ఫ్ దేశాల కార్మికులకు (ఎన్నారై రైతులు) కూడా రైతుబంధు పధకం వర్తింపజేస్తాము. వారికి కూడా రూ.5 లక్షల జీవిత భీమా కల్పిస్తాము.

5. గల్ఫ్ దేశాలలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఆర్ధిక సహాయం కల్పిస్తాము.

6. గల్ఫ్ దేశాల నుంచి తిరిగివచ్చిన ఏడాదిలోపు మరణించిన వారికి కూడా కల్పిస్తాము.

7. గల్ఫ్‌ కార్మికులకు ఆరోగ్యశ్రీ వర్తింపు.

8. గల్ఫ్ దేశాలలో జైళ్ళలో మగ్గుతున్న కార్మికులకు న్యాయసహాయం అందిస్తాము.

9. గల్ఫ్‌ కార్మికులకు జీవిత భీమా, ప్రమాద భీమా, ఆరోగ్య భీమా, పెన్షన్ సౌకర్యాలు కల్పిస్తాము. వారు గల్ఫ్ దేశాలలో ఉన్నప్పటికీ రేషన్ కార్డులలో వారి పేర్లు తొలగించబోము.

10. గల్ఫ్ దేశాలకు వెళ్ళేందుకు అవసరమైనా ఖర్చుల కోసం బ్యాంక్ రుణాలు ఇప్పిస్తాము. మెడికల్ చెకప్ ఖర్చులను కూడా తిరిగి చెల్లిస్తాము.

11. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాము.

12. గల్ఫ్ దేశాల నుంచి తిరిగివచ్చిన వారు మళ్ళీ ఇక్కడ స్థిరపడేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తాము.

Untitled Document
Advertisements