హైదరాబాద్ లో గాలి జనార్దనరెడ్డి

     Written by : smtv Desk | Fri, Nov 09, 2018, 12:38 PM

హైదరాబాద్ లో గాలి జనార్దనరెడ్డి

కర్ణాటక, నవంబర్09: అంబిడెంట్‌ మార్కెటింగ్‌ సంస్థ వేలాది మందిని మోసగించిన తరుణంలో నమోదైన ఈడీ కేసులను గాలి జనార్దనరెడ్డి మాఫీ చేయిస్తానంటూ రూ.25 కోట్లకు చేసుకున్న డీల్ కర్ణాటకలో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో అరెస్టైన ప్రధాన నిందితుడు, అంబిడెంట్‌ సంస్థ ఎండీ సయ్యద్‌ అహ్మద్‌ ఫరీద్‌, బెంగళూరుకు చెందిన బులియన్‌ వ్యాపారి రమేష్‌ కొఠారి, బళ్లారికి చెందిన ఆభరణాల వ్యాపారి రమేష్‌ను పోలీసులు తమదైన శైలిలో విచారించినప్పుడు ఈ వ్యవహారం బయటపడిందని బెంగళూరు సెంట్రల్‌ క్రైం (సీసీబీ) పోలీసులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న గాలి జనార్దనరెడ్డి నాటి నుంచి పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో గాలికి చెందిన బెంగళూరు, హైదరాబాద్‌, బళ్లారి, దిల్లీల్లోని నివాసాల్లో సీసీబీ అధికారులు సోదాలు జరిపారు. మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గాలి హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

విదేశాలకు పారిపోయే అవకాశాలుండటంతో లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు బెంగళూరు నగర పోలీసు కమీషనరు సునీల్‌ కుమార్‌ వెల్లడించారు. సీసీబీ పోలీస్‌ అధికారి మంజునాథ్‌ చౌదరి నేతృత్వంలో 8 మంది పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో సిబ్బంది గురువారం ఉదయం బళ్లారికి చేరుకున్నారు. గాలి ఇంటికి చేరుకున్న అధికారులు వాచ్‌మన్‌ సాయంతో తాళం తీయించి లోనికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న గాలి జనార్దనరెడ్డి మామ పరమేశ్వరరెడ్డి, అత్త నాగలక్ష్మమ్మ అక్కడికి చేరుకున్నారు. వారి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా గాలి కోసం నోటీసులు జారీ చేశారు. ఏది ఏమైనా మైనింగ్ డాన్ గా బతికిన గాలి ప్రస్తుతం పోలీసులకు బయపడి దాచుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Untitled Document
Advertisements