మళ్ళీ తెరాస దే విజయమా...?

     Written by : smtv Desk | Fri, Nov 09, 2018, 04:06 PM

మళ్ళీ తెరాస దే విజయమా...?

హైదరాబాద్, నవంబర్ 09: 5 రాష్ట్రాలలో రానున్న శాసనసభ ఎన్నికలకు సర్వేలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా పొలిటికల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ అనే సంస్థ 5 రాష్ట్రాలలో వివిద నియోజకవర్గాలలో ప్రజలను ఫోన్ ద్వారా ప్రశ్నించి సర్వే నిర్వహించింది. ఆ సంస్థ రాష్ట్రంలో 12 లోక్ సభ నియోజకవర్గాలలో 6,877 మందిని ప్రశ్నించి ఈ నివేదికను ప్రకటించింది.

దాని ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 75 శాతం మంది ఓటర్లు కేసీఆర్‌ పాలన పట్ల, ఆయన ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పధకాల పట్ల సంతృప్తిగా ఉన్నారని, కనుక వారందరూ మళ్ళీ తెరాసకే ఓటు వేసి గెలిపించబోతున్నారని తేలింది. ఈ ఎన్నికలలో తెరాసను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ టిడిపితో పొత్తులు పెట్టుకొని మహాకూటమిని ఏర్పాటు చేసుకొన్నప్పటికీ దాని పట్ల ప్రజలు సానుకూలంగా లేరని సర్వేలో తేలింది. తెరాస-మజ్లీస్ స్నేహం కారణంగా మజ్లీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఓట్లను చీల్చబోతునట్లు సర్వేలో తేలిందని పొలిటికల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ ప్రకటించింది.

ఇక బిజెపి పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ లో బిజెపికి 52 శాతం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో 55 శాతం, రాజస్థాన్ రాష్ట్రంలో 35 శాతం ఓటర్లు అనుకూలంగా ఉన్నారని సర్వేలో తేలింది. అంటే ఈసారి ఎన్నికలలో రాజస్థాన్ కాంగ్రెస్‌ హస్తగతం అయ్యే సూచనలున్నాయని అర్ధమవుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ బిజెపికి గట్టి పోటీ ఇవ్వనుందని స్పష్టం అవుతోంది. కానీ తెలంగాణలో మాత్రం తెరాస చేతిలో కాంగ్రెస్ పార్టీకి పరాజయం తప్పదని సర్వే నివేదికలో పేర్కొంది.

Untitled Document
Advertisements