చిరంజీవి కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Sun, Nov 11, 2018, 04:32 PM

చిరంజీవి కీలక నిర్ణయం

టీడీపీతో అనైతిక పొత్తును విభేదిస్తూ కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయాలని మెగాస్టార్‌ చిరంజీవి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన ఇప్పటికే కుటుంబ సభ్యులతో చర్చించారని, కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్టు త్వరలోనే చిరంజీవి ప్రకటన చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇటీవల ఢిల్లీలో సమావేశమైన సీఎం చంద్రబాబు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కలసి పనిచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ కలయికపై ఇప్పటికే రెండు పార్టీల్లోనూ అసమ్మతి జ్వాలలు మిన్నంటాయి. కాంగ్రెస్‌ పార్టీ నుంచి సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్, పసుపులేటి బాలరాజు, సి.రామచంద్రయ్య తదితరులు బయటకు వచ్చేశారు. ఈ క్రమంలోనే చిరంజీవి కూడా అనైతిక పొత్తును నిరసిస్తూ కాంగ్రెస్‌కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

గత ఏప్రిల్‌ 2వతేదీతో రాజ్యసభ సభ్యుడిగా చిరంజీవి పదవీకాలం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో కొనసాగాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్న సమయంలో కాంగ్రెస్, టీడీపీల మధ్య పొత్తులు కుదరటంతో పార్టీని వీడేందుకు ఇదే సరైన సమయమని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. తనతో సహా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నేతల్లో ఏ ఒక్కరితోనూ కాంగ్రెస్‌ అధిష్టానం చర్చించకుండా టీడీపీతో పొత్తులకు సిద్ధపడటంపై చిరంజీవి తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం.





Untitled Document
Advertisements