ఎన్నికల్లో ఘననీయంగా పెరిగిన అభ్యర్థుల సంఖ్య

     Written by : smtv Desk | Tue, Nov 20, 2018, 07:07 PM

ఎన్నికల్లో ఘననీయంగా పెరిగిన అభ్యర్థుల సంఖ్య

హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్వం అభ్యర్థులతో వాటితో పోలిస్తే ఈ సారి అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికలలో 2662 మంది అభ్యర్ధులు పోటీ పడితే, ఈసారి ఎన్నికలలో 119 స్థానాలకు 3,584 మంది పోటీ పడుతున్నారు.

నామినేషన్లు వేయడానికి చివరి రోజైన నిన్న వొక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 2,087 నామినేషన్లు దాఖలు అయ్యాయి. నిన్న కార్తీక సోమవారం...అందునా ఏకాదశి కావడం, బిజెపి, మహాకూటమిలో పార్టీలు చివరి నిమిషంలో అభ్యర్ధులకు బిఫారంలు అందజేయడం వంటి కారణాలతో నిన్న వొక్కరోజే 2,087 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

ఈసారి మహాకూటమిలో పొత్తులు కారణంగా నాలుగు పార్టీలు కొన్ని సీట్లు కోల్పోవడం చేత టికెట్ ఆశించి భంగపడిన రెబెల్ అభ్యర్ధుల సంఖ్య పెరిగింది. అలాగే ఈసారి కొన్ని కొత్తపార్టీలు, కూటములు పుట్టుకు రావడం, స్వతంత్ర అభ్యర్ధుల సంఖ్య పెరగడంతో ఆ మేరకు నామినేషన్లు కూడా పెరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి (2014) ఎన్నికలలో 294 నియోజకవర్గాలకు 550 మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీపడగా, ఈసారి వొక్క తెలంగాణ రాష్ట్రంలో 119 స్థానాలకు 675 మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీ పడుతున్నారు.

ఈరోజు ఎన్నికల సంఘం అధికారులు అభ్యర్ధుల నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. రేపు, ఎల్లుండి నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఉంటుంది. సరిగ్గా మరో 16 రోజులలో అంటే డిసెంబరు 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. డిసెంబరు 11న ఓట్లు లెక్కింపు చేసి ఫలితాలు వెల్లడిస్తారు.

Untitled Document
Advertisements