అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్

     Written by : smtv Desk | Thu, Nov 22, 2018, 01:29 PM

అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్

జమ్మూకశ్మీర్‌, నవంబర్ 22: గవర్నర్ సత్యపాల్ మాలిక్ కాంగ్రెస్‌, పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో పిడిపి-బిజెపి సంకీర్ణ ప్రభుత్వంలో నుంచి బిజెపి తప్పుకొన్న తరువాత జూన్ 19 నుంచి అసెంబ్లీని నిద్రావస్థలో ఉంచి రాష్ట్రంలో గవర్నర్ పాలన సాగిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బద్ద శత్రువులైన పిడిపి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్దం అయ్యాయి.

ఈ మేరకు పిడిపి అధినేత్రి, మాజీ సిఎం మహబూబా ముఫ్తీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు వొక లేఖ కూడా వ్రాశారు. తమకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని ఆ లేఖలో కోరారు. కానీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆ లేఖను పట్టించుకోకుండా బుదవారం రాత్రి అసెంబ్లీని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విభిన్న రాజకీయ దృక్పదాలు కలిగిన పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా అవి సుస్థిరమైన పాలన అందించలేవనే అభిప్రాయంతో అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు రాజ్ భవన్ వొక ప్రకటన ద్వారా తెలియజేసింది. అసెంబ్లీ రద్దు అయ్యింది కనుక మార్చి-ఏప్రిల్ నెలలో లోక్ సభ ఎన్నికలతో పాటు జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.

మొత్తం 87 మంది ఉన్న జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో పిడిపికి-28, బిజెపి-25, కాంగ్రెస్-12,ఎన్.సి.పి-15,పికే-2, సిపిఎం-1, పిడిఎఫ్-1, స్వతంత్రులు-3 మంది ఎమ్మేల్యేలు ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 44 మంది అవసరం.





Untitled Document
Advertisements