221 మీటర్ల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహం

     Written by : smtv Desk | Sun, Nov 25, 2018, 03:51 PM

221 మీటర్ల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహం

గుజరాత్, నవంబర్ 25: గుజరాత్‌లో ఐక్యతా విగ్రహం పేరుతో కేంద్ర ప్రభుత్వం నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ విగ్రహం కన్నా ఎత్తైన విగ్రహాన్ని నిర్మించేందుకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు అయోధ్యలో 221 మీటర్ల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవనీశ్‌ అవస్థి వెల్లడించారు. ప్రతిపాదిత విగ్రహ నమూనా, ఇతర వివరాలను ఆయన వెల్లడించారు. సరయు నది ఒడ్డున వంద ఎకరాల ప్రాంతంలో 50 మీటర్ల ఎత్తైన పీఠంపై 151 మీటర్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాముడి తలపై ఛత్రం వంటి నిర్మాణం ఉంటుందని, దీని ఎత్తు మరో 20 మీటర్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి ఎంపిక చేసిన 5 సంస్థలు.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు శనివారం నమూనాపై ప్రదర్శన ఇచ్చాయని వెల్లడించారు. విగ్రహ ఏర్పాటుకు ఇప్పటికే భూ పరీక్ష పూర్తయినట్లు తెలిపారు.

50 మీటర్ల ఎత్తైన పీఠంలో మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో రామాయణానికి సంబంధించిన సంఘటనలు, ఇతర సమాచారాన్ని ప్రదర్శించనున్నారు. అయోధ్య చరిత్రతో పాటు విష్ణువు 10 అవతారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉంచనున్నారు. గత నెల 31న గుజరాత్‌లో ప్రధాని మోడీ సర్దార్‌ 182 మీటర్ల ఎత్తైన వల్లభ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements